ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా భద్రత – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
నవంబర్ 18న గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రచారం
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల, నవంబర్ 13:
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
నవంబర్ 14 నుంచి ప్రచారం ప్రారంభించి, నవంబర్ 18న ప్రతి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నవంబర్ 19 నుంచి గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.
కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదన సభ్యుడికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు తెలిపారు. దరఖాస్తుల సేకరణ, నామినీ వివరాల నమోదు, ఆధార్ ఆధారిత వయస్సు నిర్ధారణ, డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 15 నుంచి 20 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన ప్రతి కుటుంబం వివరాలను సేకరించి, ఏ ఒక్క కుటుంబం నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని సూచించారు. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల పరిహారం అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఐడీఓసీ నుంచి పాల్గొనగా, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


0 Comments