న్యూయార్క్ వేదికగా ‘వరల్డ్ హ్యూమన్ అలయన్స్’ ఆవిర్భావం!
న్యూయార్క్, అక్టోబర్ 17 (ప్రజా దండోర న్యూస్ ):
🌎 ప్రపంచ శాంతి, సమానత్వమే లక్ష్యంగా ‘వరల్డ్ హ్యూమన్ అలైన్స్
న్యూయార్క్ వేదికగా అంతర్జాతీయ సంస్థ ప్రారంభం.. వ్యవస్థాపక ఛైర్మన్‌గా డా. అద్దంకి దయాకర్
మే 2027లో ఐక్యరాజ్యసమితి వేదికగా ‘హ్యూమానిటీ అండ్ ది వరల్డ్’ అంతర్జాతీయ మహాసదస్సు నిర్వహణకు నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మానవ గౌరవం, సమానత్వం, న్యాయమే ప్రధాన ఎజెండా
ప్రపంచవ్యాప్తంగా శాంతి, సమానత్వం, మానవీయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ‘వరల్డ్ హ్యూమన్ అలైన్స్’ (World Human Alliance–WHA) అంతర్జాతీయ సంస్థ అమెరికాలోని న్యూయార్క్ వేదికగా అధికారికంగా ప్రారంభమైంది. మేధావులు, సామాజికవేత్తలు, దౌత్యవేత్తల సమక్షంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
పీడిత, ఉపేక్షిత వర్గాల హక్కుల పరిరక్షణే ధ్యేయం
ప్రపంచవ్యాప్తంగా పీడిత, ఉపేక్షిత వర్గాల హక్కులను పరిరక్షించడం, గ్లోబల్ సౌత్‌తో పాటు మూడో ప్రపంచ దేశాల ప్రజల గొంతుకగా నిలవడం WHA ప్రధాన లక్ష్యమని డా. అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. జాతి, కుల, మత వైషమ్యాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు గౌరవంతో పాటు మరింత బాధ్యతను కల్పించిందన్నారు.
ఏఐ యుగంలో మానవ గౌరవం, సమానత్వం, న్యాయంపై ప్రత్యేక దృష్టి
ఆధునిక ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–AI) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని WHA తన తొలి కార్యాచరణలో భాగంగా “Human Dignity, Equality and Justice in the Age of AI” అనే అంశాన్ని ఎంచుకుంది.
ఏఐ సాంకేతికత ఉద్యోగాలు, విద్య, సామాజిక వ్యవస్థలపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయడంతో పాటు, సాంకేతిక అభివృద్ధి కారణంగా సామాజిక అసమానతలు పెరగకుండా చూడటం, సాంకేతికత ద్వారా లభించే ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా కృషి చేయడం సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది.
లండన్‌లో ప్రతినిధుల సమావేశం.. న్యూయార్క్‌లో అంతర్జాతీయ మహాసదస్సు
సంస్థ ప్రారంభోత్సవంలో ఐదు ఖండాలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు రాజ్యాంగ రూపకల్పన కమిటీ, సంస్థాగత సమన్వయ బాధ్యతల వివరాలను ప్రకటించారు. తదుపరి కార్యక్రమాల్లో భాగంగా ‘కాంటినెంటల్ రిప్రజెంటేటివ్స్ మీట్’ను లండన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే, ‘హ్యూమానిటీ అండ్ ది వరల్డ్’ పేరుతో 2027 మే మొదటి వారంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా తొలి అంతర్జాతీయ మహాసదస్సును నిర్వహించేందుకు తీర్మానించారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు, ప్రజా నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, జనరేషన్-జెడ్ (Gen-Z) ప్రతినిధులు పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో విస్తృత కార్యవర్గం
WHAకు మార్గదర్శకులుగా ప్రొఫెసర్ సైమన్ (హార్వర్డ్), పగిడిపాటి దేవయ్య (టాంపా), జార్జ్ అబ్రహాం (లాంగ్ ఐలాండ్), అశోక్ అరోరా (ఇండియా) వ్యవహరించనున్నారు. గ్లోబల్ చీఫ్ ఆర్గనైజర్‌గా రాయ్దాస్ మంతెన బాధ్యతలు చేపట్టగా, గ్లోబల్ కో-ఆర్డినేటర్లుగా వంగల విద్యాసాగర్, కడరి రాజశేఖర్, కర్నాటి సాయినాథ్, శ్రీధర్ చిల్లర, భరత్ టోనీ జెన్ను నియమితులయ్యారు.
ఖండాల వారీగా అమెరికా నుంచి జాషువా జైసింగ్, యోగేష్, సందీప్ వంగల, బల్దేవ్ సింగ్; ఆస్ట్రేలియా నుంచి చంద్రకాంత్, రాజశేఖర్ రెడ్డి, శ్రీమాన్; ఆసియా నుంచి వీరారెడ్డి, కిషోర్; యూరప్ నుంచి మురళీధర్, సాయికుమార్; ఆఫ్రికా నుంచి గౌతమ్, దీవెనయ్య ప్రాతినిధ్యం వహించనున్నారు.
కీలక బాధ్యతలు
రాజ్యాంగ రూపకల్పన కమిటీలో రాయ్దాస్ మంతెన, జాషువా జైసింగ్, సందీప్ వంగల, యోగేష్, శరత్ చంద్ర సభ్యులుగా వ్యవహరించనున్నారు.
గ్లోబల్ పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా రాజేందర్ డిచ్పల్లి, సంస్థల కో-ఆర్డినేటర్‌గా గంగాసాని రాజేందర్ రెడ్డి, గ్లోబల్ ఐటీ కో-ఆర్డినేటర్‌గా రామకృష్ణ, న్యూయార్క్ కాన్ఫరెన్స్ ఇన్‌ఛార్జ్‌గా ఇమ్రాన్ పాషా, మీడియా ఇన్‌ఛార్జ్‌గా చెన్నూరి సత్యనారాయణ రావు బాధ్యతలు నిర్వహించనున్నారు.
జనరేషన్-జెడ్ సమన్వయకర్తలుగా సబీరా ఖాన్, సుమీత్, విశాల్, పవన్; మహిళా కో-ఆర్డినేటర్లుగా ఎ. నాగమణి, సబీరా ఖాన్ వ్యవహరించనున్నారు.
మానవతా విలువల పరిరక్షణకు ప్రపంచవ్యాప్త ఉద్యమం
ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటిచెప్పడం, సమానత్వం, న్యాయం, మానవ గౌరవం ఆధారంగా సమాజ నిర్మాణానికి కృషి చేయడమే తమ అంతర్జాతీయ సంస్థ లక్ష్యమని డా. అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, సామాజిక ఉద్యమకారులు, యువత సహకారం అందించాలని ఆయన కోరారు.
– డా. పేట భాస్కర్, ఎడిటర్ | ప్రజా దండోర


0 Comments