ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జిల్లాలో ఈ ఏడాది 79 అట్రాసిటీ కేసులు నమోదు బాధితులకు రూ.6.90 కోట్ల పరిహారం చెల్లింపు గ్రామస్థాయిలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13:
ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం అమలులో భాగంగా బాధితులకు సత్వర న్యాయం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
79 అట్రాసిటీ కేసులు నమోదు
ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం (సవరణ)-2015, పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 అమలుపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 79 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 20 కేసులు నిరూపితమయ్యాయని, మిగిలిన కేసులు న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయని వివరించారు.
బాధితులకు రూ.6.90 కోట్ల పరిహారం
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో కలెక్టరేట్ స్థాయిలో ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్లో లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం రూ.7.60 కోట్ల పరిహారం మంజూరు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.6.90 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన రూ.79 లక్షలు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో పౌర హక్కుల దినోత్సవం
ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా గ్రామస్థాయిలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆలస్యంగా పత్రాలు పొందడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించాలని తెలిపారు.
పెండింగ్లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు న్యాయం అందించడంలో నిర్లక్ష్యం వహించకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
కుల వివక్షకు తావులేకుండా దసరా వేడుకలు
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బాధితులు ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు అధికారులు సానుకూలంగా స్పందించి, వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రతి గ్రామ అభివృద్ధి కమిటీకి కుల వివక్షకు తావులేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పండుగ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు సమానంగా పాల్గొనేలా చూడాలని, గ్రామాల్లో సామాజిక సామరస్యం, సమానత్వ భావనలను పెంపొందించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, బాధితులకు పరిహారం చెల్లింపు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, పౌర హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. చట్టాల అమలులో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



0 Comments