సహజ వనరులను ఖుని చేస్తున్నా అధికారుల చర్యలేవి..? అర్పనపల్లి శివారులో యథేచ్ఛగా చెరువు శిఖం భూముల ఆక్రమణ.
ప్రజా దండోర న్యూస్ / మహబుబాబాద్, జూన్ 11:
మహబుబాబాద్ జిల్లా కేససముద్రం మండలం అర్పనపల్లి గ్రామ మన్నెకుంట చెరువు శిఖం భూములను ఆక్రమిస్తూ, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సద్గురు స్టోన్ క్రషర్ మిల్లు యాజమాన్యం ఒకచోట అనుమతులతో మరోచోట చెరువు పరివాహక ప్రాంతంలో భారీ స్థాయిలో మైనింగ్ చేపడుతున్నారు. అంతేకాకుండా చెరువు శిఖం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణం జరగడం ఇప్పుడు మరింత చర్చగా మారింది. దీనికి విద్యుత్ శాఖ అధికారులు ఎలా అనుమతులు మంజూరు చేశారన్న ప్రశ్న స్థానికుల్లో ఉత్కంఠ రేపుతోంది.
భారీ బ్లాస్టింగ్‌లతో క్రషర్ మిల్లు నిర్వాహకులు నిర్వహిస్తున్న రింగ్ బ్లాస్టింగ్‌ల ప్రభావంతో అర్పణపల్లి సహా పరిసర గ్రామాలు భూకంపం వచ్చినట్లు కంపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. పేలుళ్ల ధాటికి ఇళ్లలో బీటలు పడటం, సాగునీటి బావులు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. స్థానిక అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్థులు పలుమార్లు జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి అర్జీలను కూడా తూతూమంత్రంగా ముగిస్తూ బుట్టదాఖలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
సహజ వనరులను కాపాడకపోతే భవిష్యత్ అంధకారమే – డి.ఎస్.ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్
స్థానిక క్రషర్ మిల్లు అనుమతులకు విరుద్ధంగా ప్రభుత్వ నియమానిబంధనాలకు వ్యతిరేకంగా యాదేచ్చగా నడుపుతున్న అక్రమ మైనింగ్ పై డిఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ మండిపడ్డారు.
“చెరువులు, ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందనీ కానీ, వారు ఈ అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం చాలా దూర్మార్గమని, ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి వేసే చర్య అని అన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో తవ్వకాలు జరగడం చట్ట విరుద్ధం. వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.


0 Comments