మామిడి సాగులో శాస్త్రీయ పద్ధతులు అవలంబించి నాణ్యమైన దిగుబడులు సాధించాలి - రైతులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన - ప్రజా దండోర

 



శాస్త్రీయ పద్ధతులతో మామిడి సాగు చేయాలి, జిల్లాస్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్


మామిడి సాగులో శాస్త్రీయ పద్ధతులు అవలంబించి నాణ్యమైన దిగుబడులు సాధించాలి - రైతులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల / గొల్లపెల్లి, జూలై 6:


మామిడి సాగులో ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను రైతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోమవారం గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ (శ్రీరాములపల్లి)లో నిర్వహించిన జిల్లాస్థాయి మామిడి వర్క్‌షాప్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.



ఈ సందర్భంగా మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మామిడి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే శాస్త్రీయ సాగు విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు అందించే సాంకేతిక సూచనలు, శాస్త్రవేత్తల సలహాలను రైతులు సద్వినియోగం చేసుకుని సాగులో ఆధునిక విధానాలను అమలు చేయాలని కోరారు.



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ మామిడి రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేపడితే అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చన్నారు. చెట్ల కొమ్మల కత్తిరింపులు, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పురుగు మరియు వ్యాధుల నివారణ, కోత అనంతర నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.



ప్రముఖ మామిడి శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్ మాట్లాడుతూ మామిడి సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. చెట్ల కత్తిరింపులు, సమతుల్య ఎరువుల యాజమాన్యం, పురుగు-వ్యాధుల నియంత్రణ, మందుల పిచికారీ, నీటి నిర్వహణ, కోత అనంతర జాగ్రత్తలు, నిల్వ, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలను వివరించారు. ఈ సూచనలు పాటించడం ద్వారా నాణ్యమైన దిగుబడులతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మామిడి రైతులు మరియు సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments