జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదు... 48 నుంచి 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదు... 48 నుంచి 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 


పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


ప్రజా దండోర న్యూస్ / సురేష్ కొడిపెల్లి, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ, జూన్ 10:

జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.



మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రబీ 2025-26 సీజన్‌లో జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 5.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చిందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 436 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.


ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ధాన్యంలో కోతలు జరుగుతున్నాయని, కొనుగోళ్లు సక్రమంగా లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఈ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు.



మిల్లర్ల వద్ద స్థల సమస్యలు ఎదురైన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లాను సందర్శించారని, మిల్లర్లు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించామని చెప్పారు. మొత్తం 81,954 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే రూ.1,075 కోట్లు విడుదల చేశామని, దాదాపు 90 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. రైతుల ఖాతాల్లో 48 నుంచి 72 గంటల్లోనే నగదు జమ అవుతోందని పేర్కొన్నారు.


హమాలీల కొరత, గన్నీ బ్యాగుల కొరత వంటి అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ జిల్లాలో రికార్డు స్థాయిలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి, 47 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు నిర్వహించగలిగామని మంత్రి వెల్లడించారు.


మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ధాన్యంలో 10 కిలోల కోత విధించారని చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. ఆయనకు సంబంధించిన ట్రక్ షీట్‌ను మీడియా ముందు ఉంచుతున్నామని, మొత్తం 190 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి పూర్తి చెల్లింపులు కూడా చేసినట్లు స్పష్టం చేశారు.


దేశంలో ఇంత పెద్ద ఎత్తున రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మరొకటి లేదని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం వరి కొనుగోళ్లతో పాటు ఇతర పంటల కొనుగోళ్లను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేయాలని కోరారు.


ఈ సందర్భంగా *జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,*  యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న దిగుబడులు మార్కెట్‌కు వచ్చాయని తెలిపారు. జిల్లాలో సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,100 కోట్లకు పైగా జమ చేసినట్లు చెప్పారు.


ఈ సీజన్‌లో సుమారు 47 వేల టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధర ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి అన్ని పంటలను కొనుగోలు చేస్తోందన్నారు.


ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు జరగలేదని, తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో భారీ స్థాయిలో కొనుగోళ్లు నిర్వహించామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments