ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ - ప్రజా దండోర



పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 05:

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.



ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలకు చెట్ల పెంపకం ఒక ప్రధాన పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని పెంచి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దడం కూడా అంతే ముఖ్యమని ఎస్పీ గారు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు సమాజంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పోలీసు శాఖ కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ సందర్భాల్లో మొక్కల నాటే కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పచ్చని పర్యావరణం, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఎస్పీ కోరారు.  

 


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.ఐలు మరియు సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.

Post a Comment

0 Comments