వైద్యుల బదిలీల్లో జీవో 38 అమలు చేయాలి ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి - డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి, జూన్ 5:
వైద్యుల బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 38లో పేర్కొన్న నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీజీజీడీఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఒక రోజు నిరసన తెలుపుతూ వైద్యసేవలు అందించామని, ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 38లో పొందుపరిచిన అన్ని ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూ వైద్యులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా కల్పించే స్పౌస్ ప్రాధాన్యతతో పాటు ఇతర ప్రత్యేక ప్రాధాన్యతా ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. వైద్యులు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి అర్హులైన వారికి తక్షణమే బదిలీలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రభుత్వం గుర్తింపు పొందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీవో 38 నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు రాష్ట్ర సంఘం పదాధికారులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించవద్దని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు.
వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే వైద్యసేవలను నిలిపివేసేందుకు కూడా వెనుకాడబోమని డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో టీజీజీడీఏ జిల్లా కోశాధికారి డాక్టర్ జి. నవీన్‌తో పాటు టీవీవీపీ, మెడికల్ కాలేజీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలోని వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments