కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో ఏసీబీ దాడి, ₹ 80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు - ప్రజా దండోర


కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో ఏసీబీ దాడి, ₹ 80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు


ఫినాఫ్తలీన్ పరీక్షలో దొరికిపోయిన అధికారి, కార్యాలయంలో కలకలం


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల  జిల్లా ప్రతినిధి, జూన్ 04 : 


జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) మొయినొద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.


అసలేం జరిగింది:


బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఫిర్యాదుదారుడి ద్వారా రసాయన పూత పూసిన నోట్లను కొడిమ్యాల అటవీ శాఖ రేంజ్ అధికారి మొయినొద్దీన్‌కు అందించారు. లంచం తీసుకున్న వెంటనే కార్యాలయంలోకి ప్రవేశించిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. 


అనంతరం నిర్వహించిన ఫినాఫ్తలీన్ పరీక్షలో అధికారి చేతులు గులాబీ రంగులోకి మారడంతో లంచం తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. టేబుల్‌పై రూ.500 నోట్ల కట్టలు, రసాయన పరీక్ష కోసం వినియోగించిన మూడు సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


కార్యాలయంలో తనిఖీలు:

దాడుల అనంతరం ఏసీబీ అధికారులు ఫారెస్ట్ కార్యాలయంలోని రికార్డులు, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు కీలక పత్రాలను సీజ్ చేసి, అధికారి నివాసంలోనూ సోదాలు కొనసాగించినట్లు సమాచారం.


అధికారుల హెచ్చరిక:

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106 కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


ఈ ఘటనతో కొడిమ్యాల ఫారెస్ట్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Post a Comment

0 Comments