కోరుట్ల గడి స్థలాలను రక్షించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించండి, ప్రజావాణిలో ఆర్డీవో జీవాకర్ రెడ్డిని కోరిన అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు 


 గడి స్థలాల్లో వేసిన అక్రమ విఎల్టీల ఫైల్, వాటి రద్దుకు కౌన్సిలర్లు పూర్తి మద్దతుతో  చేసిన సంతకాల ప్రతులను ఆర్డీవో కు అందించారు 


ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 18 :


కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి స్థలాల్లో నకిలీ దస్తావేజులతో అక్రమంగా వేసిన విఎల్టీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు కోరుట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో ) మరియు గడి స్థలాల విచారణ అధికారి జీవాకర్ రెడ్డికి సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. 


ఈ సందర్భంగా ట్రాన్స్ఫర్ అయిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ అక్రమంగా వేసిన విఎల్టీ ఫైల్, వాటిని రద్దు చేయాలని కౌన్సిలర్లు పూర్తి మద్దతుతో చేసిన సంతకాల ప్రతులను కూడా ఆర్డీవో కు అందజేశారు.



అనంతరం నాయకులు మాట్లాడుతూ కోరుట్ల గడి బురుజులు, కోనేరు మరియు సంబంధిత స్థలాలు చాళుక్య–జైనుల కాలం నాటి చారిత్రక వారసత్వ సంపద అని తెలిపారు. ఈ ప్రజా ఆస్తులను కొంతమంది నకిలీ దస్తావేజులతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ H.No 6-4-228 ఆధారంగా  5,800 గజాల భూమిపై చట్ట విరుద్ధంగా కమీషనర్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని విఎల్టీలు పొందారని ఆరోపించారు.


ఈ అంశంపై ప్రజలు, అఖిలపక్ష ప్రజాసంఘాలు ఇప్పటికే అనేక దశల్లో నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించాయని తెలిపారు. ప్రజల అభిప్రాయానికి మద్దతుగా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని పార్టీల కౌన్సిలర్లు, అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ చైర్మన్, మాజీ చైర్మన్లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు అక్రమ విఎల్టీలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా సంతకాలు చేశారని పేర్కొన్నారు.పూర్తి కౌన్సిల్ మద్దతుతో కూడిన సంతకాల ప్రతులను ఆర్డీవో కు అందజేయడం ద్వారా ప్రజల ఐక్యత మరియు గడి స్థలాల పరిరక్షణపై ఉన్న సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేశారు.


వెంటనే ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్  సమావేశం ఏర్పాటు ద్వారా ఈ అక్రమ అనుమతులను రద్దు చేయడానికి చట్టపరమైన బలమైన ఆధారం ఏర్పడిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243W మరియు తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్–2019 ప్రకారం ప్రజా ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వం బాధ్యత వహించాలని  గుర్తు చేశారు.

అదే విధంగా అక్కడి గడి స్థలాలలో కూరగాయల మార్కెట్, పార్కు, మైసమ్మ దేవాలయం అభివృద్ధి చేయడంతో పాటు దసరా మహిషాసుర మర్దన, బతుకమ్మ, గణేష్, మొహరం వంటి సాంప్రదాయ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.



ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, చెన్న విశ్వనాథం, చింత భూమేశ్వర్, సుతారి రాములు , కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, శనిగారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.