నేరాల నియంత్రణలో, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం - డిఎస్పి రాములు
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పొరుమల్ల గ్రామంలో 16 సీసీ కెమెరాల ప్రారంభం
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం
ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్, జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 09 :
జగిత్యాల జిల్లా మేడి పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని పొరుమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను మెట్ పల్లి డిఎస్పీ అడ్లూరి రాములు చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పోలీసులకు ఒక శక్తివంతమైన ఆయుధంలా మారాయని పేర్కొన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు దానిలో పాల్గొన్న నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు .
గ్రామంలో జరిగే చిన్న చిన్న సంఘటనల నుండి పెద్ద ఘటనల వరకు ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేస్తూ ప్రజలకు నిరంతర భద్రతను అందిస్తాయని, నేరాలను తగ్గించడంలో మరియు అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పోలీసులకి ప్రజల సహకారం తోడైతేనే శాంతి భద్రతలు మరింత బలపడతాయని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని డీఎస్పీ పేర్కొన్నారు.
అలాగే ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సిఐ లక్ష్మీనారాయణ, ఎస్సై శ్రీధర్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



0 Comments