కోరుట్ల గడి స్థలాల్లో అక్రమ విఎల్టీల రద్దుకై సంతకాలు చేసిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు - ప్రజా దండోర

 


కోరుట్ల గడి స్థలాల రక్షణకు అన్ని పార్టీల కౌన్సిలర్లును ఏకం చేసిన అఖిలపక్ష ప్రజా సంఘాలు నాయకులు 


గడి స్థలాల్లో అక్రమ విఎల్టీల రద్దుకై సంతకాలు చేసిన అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు


ఇక మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో రద్దు ఖాయం అంటున్న ప్రజాసంఘాలు

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 11:

కోరుట్ల పురాతన గడి బురుజులు, కోనేరు మరియు వాటి స్థలాల రక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమం కీలక మలుపు తిరిగింది. చాళుక్య–జైనుల కాలం నాటి చారిత్రక సంపదను కాపాడాలని గత కొన్ని సంవత్సరాలుగా అఖిలపక్ష ప్రజాసంఘాలు దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, గడి స్థలాల్లో అక్రమంగా వేసిన విఎల్టీల రద్దుకు ఇప్పుడు అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ముందుకు రావడం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.


ఇప్పటికే బీజేపీ, బిఆర్ఎస్ కౌన్సిలర్లు పూర్తి మద్దతు తెలుపుతూ సంతకాలు చేయగా, తాజాగా సోమవారం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహేద్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ జయలక్ష్మి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అన్నం లావణ్య అనీల్ సంతకాలు చేశారు. మిగతా కౌన్సిలర్లు కూడా సంతకాలు చేస్తున్నారు.



గడి స్థలాల్లో 5800 గజాల భూమిపై నకిలీ దస్తావేజులతో విఎల్టీలు మంజూరు చేశారని ప్రజాసంఘాలు ఇప్పటికే నిరసన దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన కమిషనర్‌ రవీందర్ ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.



ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్, అఖిలపక్ష కన్వీనర్ ఎం.డి ముజాహిద్ లు మాట్లాడుతూ గడి స్థలాలు కోరుట్ల ప్రజల ఆస్తి అని, వాటిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ విఎల్టీలను వెంటనే రద్దు చేసి ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ కూరగాయల మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ దేవాలయం అభివృద్ధి చేయాలని, అలాగే దసరా మహిషాసుర మర్దన, బతుకమ్మ, గణేష్, మొహరం వంటి ఉత్సవాలు యథావిధిగా అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.



 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243W ప్రకారం మున్సిపాలిటీలకు ప్రజా ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉందని తెలిపారు. అలాగే తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్–2019లోని నిబంధనల ప్రకారం చట్ట విరుద్ధంగా, నకిలీ దస్తావేజులతో లేదా ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మంజూరైన అనుమతులను రద్దు చేసే అధికారం మున్సిపల్ సంస్థలకు ఉందని వివరించారు.



“పూర్తి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే అక్రమ విఎల్టీల రద్దుకు బలమైన చట్టపరమైన ఆధారం ఏర్పడుతుంది. గడి బురుజు భూములు ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు అవి ప్రజల ఆస్తి” అని నాయకులు స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, పోతని సత్యం తదితర అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments