అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు
రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్ల వినియోగం
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ :
హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అత్యవసర సేవల అందుబాటులో వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేస్తూ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి వైర్లెస్ సెట్ల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ అన్ని విభాగాల మధ్య సమన్వయం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాల విరమణ, దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. ముక్యంగా రాత్రి వేళల్లో పటిష్ట బందోబస్తు కొనసాగించాలని, అనుకోని ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు:
భక్తులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీస్, రెవెన్యూ మరియు వైద్య శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్గమధ్యంలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, తాగునీరు, ప్రథమ చికిత్స, మార్గదర్శక సేవలు అందిస్తున్నారు.
రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్ల వినియోగం :
హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు చేరుకునే సమయంలో ముఖ్యంగా రోడ్డు ఇరువైపులా జాగ్రత్తగా నడుస్తూ, వాహనాలను గమనిస్తూ తమ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలో బాగంగా భక్తుల యొక్క బ్యాగులు, జెండాలు మరియు ఇతర వస్తువులపై రేడియం స్టిక్కర్లను అంటించడం జరిగింది. చీకటి సమయంలో కూడా ఈ రేడియం స్టిక్కర్లు స్పష్టంగా కనిపించడంతో వాహనదారులు దూరం నుంచే భక్తులను గమనించి తమ వాహనాల వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చుఅన్నారు.



0 Comments