జనాభా లెక్కలు, ప్రభుత్వ సర్వే పేరుతో ఇండ్లలోనికి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్
ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / ఏప్రిల్ 12 :
ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభించని జనాభా లెక్కలు (Population Census) నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పి ఇళ్లకు వెళ్లి చోరీకి పాల్పడం జరిగిందని ఈలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇళ్లలోకి ప్రవేశించే వ్యక్తులపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిజమైన ప్రభుత్వ సిబ్బంది ఎప్పుడూ అధికారిక గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు కలిగి ఉంటారని, వాటిని చూపించకుండా ఎవరినీ ఇంట్లోకి అనుమతించకూడదన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ పరిసరాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు, మహిళలు ఎక్కువగా లక్ష్యంగా మారే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యులు వారికి ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే, ప్రభుత్వం తరఫున ఎలాంటి సర్వేలు నిర్వహించినా, ముందుగా సంబంధిత శాఖలు ప్రజలకు సమాచారం అందిస్తాయని, అటువంటి అధికారిక ప్రకటనలు లేకుండా వచ్చే వ్యక్తులపై అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ వారి సూచనలు
1. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి జనాభా లెక్కలు లేదా ఇలాంటి ఇంటింటికి వెళ్లే అధికారిక కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. అందువల్ల ఈ పేరుతో ఎవరైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వెంటనే అనుమానించాలి.
2. ప్రభుత్వ అధికారులుగా చెప్పుకునే వ్యక్తులు తప్పనిసరిగా అధికారిక గుర్తింపు కార్డు (ID Card) చూపించాలి. సరైన ధృవీకరణ లేకుండా ఎవరినీ ఇంట్లోకి అనుమతించరాదు.
3. అనుమానాస్పద వ్యక్తులు మీ ఇంటికి వచ్చినప్పుడు, వారితో ఒంటరిగా మాట్లాడకుండా పొరుగువారిని సమాచారం ఇవ్వడం లేదా కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది.
4. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం లేకుండా తలుపులు తెరవకుండా, అపరిచితులను లోపలికి అనుమతించకుండా ఉండాలి.
5. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి.
ప్రజల అప్రమత్తతతోనే ఇలాంటి మోసాలు, చోరీలు నివారించవచ్చని, పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు.ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎస్పీ గారు తెలిపారు.

0 Comments