నేరాల నివారణతో పాటు నేరాలను త్వరితగతిన ఛేదించాలి -జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాలను విజయవంతం చేయాలి
రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :
సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యత ఇస్తూనే జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్‌లో ఆయన పోలీస్ అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
గత నెలలో నమోదైన నేరాలపై సమగ్రంగా చర్చించిన ఎస్పీ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి వాటి సంఖ్యను తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి నాణ్యమైన, సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని పేర్కొన్నారు.
సివిల్ మరియు భూ వివాదాలపై అనుసరించాల్సిన ప్రామాణిక విధానాలు (SOP) పై పోలీస్ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై నమోదైన పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు డబ్బులు తిరిగి అందేలా బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాబోయే నేషనల్ లోక్ అదాలత్ (మార్చి 28, 2026) సందర్భంగా పరిష్కరించగల కేసులను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో వివిధ కేటగిరీలలో ఉన్న హిస్టరీ షీట్లను సమీక్షించి నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని సూచించారు. అలాగే జిల్లాల మరియు రాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చే గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేసి రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న *“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* లో భాగంగా 99 రోజులలో పోలీస్ శాఖ తరపున చేపట్టవలసిన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను చేపట్టిందని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, నేరాలను నియంత్రించడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, రోడ్డు భద్రతా చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఇటీవల జరిగిన మహాశివరాత్రి, ధర్మపురి బ్రహ్మోత్సవాలు, పెద్దపూర్ జాతర వేడుకలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని ఎస్పీ తెలిపారు. అదే స్ఫూర్తితో రానున్న రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను కూడా ప్రణాళిక ప్రకారం శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్లు మరియు ఎస్.ఐ లు పాల్గొన్నారు.


0 Comments