జగిత్యాల అభివృద్ధికే నా ఆరాటం, పోరాటం : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి / సురేష్ కొడిపెల్లి :
తన ఆరాటం, పోరాటం అంతా జగిత్యాల అభివృద్ధికోసమేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మోతే రోడ్డు లోని పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ నియోజకవర్గం లో గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు.
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో 2023 డిసెంబర్ 7కు ముందు ప్రారంభించి, ఆ తర్వాత పూర్తయిన పనులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లకు చెల్లించేలా చొరవ తీసుకున్నామని వెల్లడించారు.
పట్టణమంతా అభివృద్ధి పనులే
జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎల్‌ఎల్ గార్డెన్ సమీపంలో రూ.1 కోట్లతో చేపట్టిన పనులకు కొందరు సీనియర్ నాయకులు కోర్టు కేసులు వేసి అడ్డుపడ్డారని ఆరోపించారు. అయితే తనది వ్యక్తిగత లాభం కాదని, పట్టణ అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు.
62.5 కోట్ల UIDF నిధులు
ముఖ్యమంత్రి చొరవతో జగిత్యాల పట్టణానికి రూ.62.5 కోట్ల UIDF నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిధులు తీసుకువచ్చామని తెలిపారు. హరిని ఎంటర్‌ప్రైజెస్ రూ.7 కోట్ల 3 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందేనని, కాంట్రాక్టర్లు ఎవరి అనుచరులైనా తనకు పట్టణ అభివృద్ధే ముఖ్యమని అన్నారు.
235 కోట్లతో నూతన ఆసుపత్రి
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి జగిత్యాలకు రూ.235 కోట్లతో నూతన ఆసుపత్రి మంజూరు చేయించామని తెలిపారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన రూ.41 కోట్ల పెండింగ్ బకాయిలు మంజూరై, ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్, SDF నిధులు
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని, స్థలం విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి రూ.5 కోట్ల SDF నిధులు మంజూరు చేశారని, ప్రభుత్వంతో కలిసి పనిచేయని నియోజకవర్గాలకు ఈ నిధులు రాలేదని వ్యాఖ్యానించారు.
యావర్ రోడ్డు వెడల్పుపై స్పష్టత
యావర్ రోడ్డు విస్తరణ విషయంలో తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 2021లో యావర్ రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా మార్చి జోన్ల మార్పులు చేసిన విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రభుత్వ స్థలాలను 100 ఫీట్ల వెడల్పుగా చేసి అభివృద్ధి చేస్తున్నామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వంతో పని
తాను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని, అయినా ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానన్నారు. నిధుల కోసం ముఖ్యమంత్రిని కలిసినందుకు తనపై దాడులు చేసి, అనర్హత పిటిషన్ వేశారని ఆరోపించారు. అయినా రాష్ట్ర బీఆర్‌ఎస్ అధిష్టానాన్ని ఎన్నడూ విమర్శించలేదని తెలిపారు.
ప్రజల సంక్షేమమే నా లక్ష్యం
జగిత్యాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల ప్రేమతోనే తన గెలుపు సాధ్యమైందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

0 Comments