ఉద్యమకారుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం: డాక్టర్ పిడమర్తి రవి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు అందిస్తాం
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మహత్యలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన అనేక మంది ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో మాదిగ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు డాక్టర్ పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థి నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలకు తెగించి పోరాడినా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని అన్నారు. ఉద్యమం చేసింది తమ కుటుంబమే, రాష్ట్రాన్ని సాధించింది తామే అన్నట్లుగా గత పాలకులు వ్యవహరించి అసలైన ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు.
ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ కుటుంబ సమస్యలను స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం మంజూరయ్యేలా కృషి చేస్తామని, ఉద్యమకారులకు వర్తించే సంక్షేమ పథకాలు కూడా వారికి అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఉద్యమకారులు ఆత్మగౌరవంతో జీవించేలా 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ రాష్ట్రంలోని పేద ప్రజలు, ఉద్యమకారుల సంక్షేమం కోసం మరింతగా పనిచేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జోగు గణేష్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముత్యం గౌడ్, నార్సింగ్ రావు, మాదిగ యూత్ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్, దేవరకొండ నరేష్, బీఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు కల్వకుర్తి శ్రీశైలం, ఉపాధ్యక్షులు ఆరెకంటి శ్రీకాంత్, ఎల్. రాజు, నరేష్, రాము, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments