కోరుట్లలో కత్తితో హత్యాయత్నం.. ముగ్గురు నిందితులు అరెస్ట్!
దసరా నిమజ్జనం సందర్భంగా పాత గొడవతో దాడి.. బాధితుడికి గాయాలు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, అక్టోబర్ 21:
దసరా పండుగ సందర్భంగా జరిగిన గొడవ నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ముగ్గురు నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
గొడవతో కత్తి దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌నగర్ కాలనీకి చెందిన కిరణ్ (19), అజయ్ (19)లతో గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న తెల్లవారుజామున సుమారు 3 గంటలకు కిరణ్, అజయ్‌లు తమతో పాటు జ్ఞానదీప్ (20)ను తీసుకొని అర్బన్ కాలనీలోని దుర్గామాత ఆలయం వద్దకు వచ్చి రాజేందర్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో కిరణ్, అజయ్‌లు రాజేందర్‌ను పట్టుకోగా, జ్ఞానదీప్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాజేందర్ ఎడమ భుజం, మెడ ఎడమ వైపు గాయాలయ్యాయి.
కత్తితో బెదిరించి పరారీ
దాడిని గమనించిన స్థానికులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కోరుట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులు కిరణ్, అజయ్, జ్ఞానదీప్‌లను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
పండుగల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, గొడవలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. తిరుపతి, సబ్-ఇన్‌స్పెక్టర్ జి. శ్యామ్ రాజ్ తెలిపారు.

0 Comments