రష్యా సైన్యంలో చిక్కుకున్న తమ కొడుకుకై ప్రవాసి ప్రజావాణిలో తల్లిదండ్రుల ఫిర్యాదు

 


ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు వల!

రష్యా సైన్యంలో బలవంతపు చేరికలు.. కోరుట్ల యువకుడి ఆవేదన

తమ బిడ్డలను స్వదేశానికి రప్పించాలని ప్రవాసి ప్రజావాణిలో బాధిత కుటుంబాల వేడుకోలు

ప్రజా దండోర న్యూస్ – హైదరాబాద్, అక్టోబర్ 30:

నిరుద్యోగ యువతే లక్ష్యంగా విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు మాయమాటలతో యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన ఉద్యోగాలు, అధిక వేతనాలు కల్పిస్తామని నమ్మించి యువకులను విదేశాలకు పంపించి, అక్కడికి వెళ్లిన తర్వాత వారిని మిలిటరీ కార్యకలాపాల్లోకి బలవంతంగా నెట్టేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్‌కుమార్ ఇందుకు బాధితుడిగా మారినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లకు చెందిన గల్ఫ్ ఏజెంట్ దానం శ్రీనివాస్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రాజ్‌కుమార్‌ను రష్యాకు పంపించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రష్యాకు వెళ్లిన కేవలం 15 రోజులకే రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. తనను అక్కడి ప్రభుత్వం మిలిటరీ దళాల్లో చేర్చిందని, సరైన ఆహారం కూడా అందించడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


అంతేకాకుండా తుపాకీతో పాటు సుమారు 20 కిలోల బరువున్న సామగ్రి బ్యాగును మోస్తూ మిలిటరీ దళాల్లో పనిచేయాల్సి వస్తోందని, అక్కడి పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు తెలియజేసినట్లు సమాచారం.


కొడుకు పంపిన సందేశాలు విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో విదేశాలకు పంపించిన తమ బిడ్డ ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నాడని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. రాజ్‌కుమార్‌తో పాటు మరికొందరు భారతీయ యువకులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ పిల్లలను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

ప్రవాసి ప్రజావాణిలో బాధిత కుటుంబాల ఫిర్యాదు

ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని బాధిత కుటుంబాలు ఆశ్రయించాయి. కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్‌కుమార్ తల్లిదండ్రులతో పాటు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ప్రాంతానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులు తమ పిల్లలను రష్యా నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని కోరుతూ ఫిర్యాదులు సమర్పించారు.

ఉద్యోగాల పేరుతో యువకులను విదేశాలకు పంపించి ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న ఏజెంట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.



ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే నిరుద్యోగ యువతను మోసపూరిత ఏజెంట్ల నుంచి రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. రష్యాలో చిక్కుకున్న భారతీయ యువకుల వివరాలను సేకరించి, భారత విదేశాంగ శాఖ ద్వారా దౌత్యపరమైన చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

కన్నవారి ఆశలను నమ్ముకుని విదేశాలకు వెళ్లిన యువకులు తిరిగి వస్తారా లేదా అన్న ఆందోళనతో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడే అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత యువకులందరినీ క్షేమంగా స్వదేశానికి రప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Post a Comment

0 Comments