రాఘవపేటలో ప్లాస్టిక్ నిషేధానికి మరో ముందడుగు
దుర్గాదేవి సేవా సమితికి 800 స్టీల్ ప్లేట్ల విరాళం
తండ్రి జ్ఞాపకార్థం విరాళం అందించిన నత్తి శేఖర్, నత్తి రాము, లక్ష్మణ్
ప్రజా దండోర న్యూస్ / మల్లాపూర్, అక్టోబర్ 16:
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే లక్ష్యంతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో మరో ముందడుగు పడింది. గ్రామంలోని దుర్గాదేవి సేవా సమితికి 800 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందజేసి నత్తి శేఖర్, నత్తి రాము, లక్ష్మణ్ తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
విజన్ స్కూల్ కరస్పాండెంట్ నత్తి శేఖర్, ఒకటో వార్డు సభ్యుడు నత్తి రాము, ఎనిమిదో వార్డు సభ్యుడు లక్ష్మణ్ తమ తండ్రి స్వర్గీయ నత్తి లక్ష్మీరాజాం జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేశారు. గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గించి, వాటి స్థానంలో స్టీల్ ప్లేట్లను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తన చేతుల మీదుగా దుర్గాదేవి సేవా సమితి ప్రతినిధులకు స్టీల్ ప్లేట్లను అందజేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, తండ్రి జ్ఞాపకార్థం సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవపేట గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దాం!



0 Comments