విద్యార్థుల మృతి అత్యంత విషాదకరం: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
ప్రజా దండోర న్యూస్ | జగిత్యాల జిల్లా బ్యూరో | ఆగస్టు 3:
మల్యాల మండలంలోని ఎంపీపీఎస్ ఒడ్డెర కాలనీ పాఠశాలలో చదువుతూ సమీకృత బాలుర వసతి గృహంలో నివసిస్తున్న ఇద్దరు విద్యార్థులు టిఆర్ నగర్ కు చెందిన సుశాంత్ 4వ తరగతి, మోర్తాడ్ కు చెందిన విష్ణు 5వ తరగతి విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందడం అత్యంత విషాదకరమని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
సోమవారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఘటనపై సమీక్ష నిర్వహించి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విరామ సమయంలో ఇద్దరు విద్యార్థులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా పాఠశాల ఆవరణ దాటి బయటకు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కొంతసేపటి తర్వాత విద్యార్థులు తిరిగి రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కలిసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వివరించారు.
గాలింపు సమయంలో పాఠశాల, హాస్టల్ సమీపంలోని కొత్తకుంట వద్ద విద్యార్థుల దుస్తులు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. అనంతరం పోలీసు శాఖ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ల సహాయంతో కుంటలో గాలింపు చేపట్టగా, దురదృష్టవశాత్తు ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్, సంఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సూచించారు. విచారణలో ఎవరి నిర్లక్ష్యం తేలినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, విచారణలో విధుల్లో నిర్లక్ష్యం తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజకుమార్, డీఈఓ రాము, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు


0 Comments