కోరుట్ల గడి బురుజుల వీఎల్టీ రద్దు కాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు: ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ హెచ్చరిక

 


గడి బురుజు వీఎల్టీ రద్దు కాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు: ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ హెచ్చరిక

చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో పిర్యాదు, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తాం

జగిత్యాల జిల్లా ప్రతినిధి ప్రతినిధి, ఆగస్టు 3 (ప్రజా దండోర): 

గడి బురుజుల భూమిపై ప్రతిపాదించిన వీఎల్టీ ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కు కోరుట్ల బిఆర్ఎస్ కౌన్సిలర్ లు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే నేరుగా పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "గడి బురుజు భూమి కేవలం ఒక స్థలం కాదు... సుమారు 1100 సంవత్సరాల చారిత్రక వారసత్వానికి ప్రతీక. ఇలాంటి చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత" అని పేర్కొన్నారు.



కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ భూమిపై కన్ను పడిందని ఆరోపించిన ఆయన, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గానీ, ఏ వ్యక్తి గానీ ఈ చారిత్రక స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించలేదని అన్నారు. ప్రస్తుతం ఈ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతుండటం అత్యంత దురదృష్టకరమని ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

వీఎల్టీ ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. "గడి బురుజు భూమి పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతామని ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాల్సిందే" అని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0 Comments