సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫార్మ్‌పాండ్లు, సోక్‌పిట్లు, నిర్మాణానికి రైతులు ముందుకు రావాలి
పైడిమడుగులో ఫార్మ్‌పాండ్, రీచార్జ్ బోర్‌వెల్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులకు భూమిపూజ
కమ్యూనిటీ సోక్‌పిట్ పనుల పరిశీలన
జోగిన్‌పెల్లిలో వీవో భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణ పనులను తనిఖీ చేసిన కలెక్టర్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై - 28
సూపర్ ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా *తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని* అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ *బి. సత్యప్రసాద్* తెలిపారు.
మంగళవారం కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న *ఫార్మ్‌పాండ్‌కు భూమిపూజ* నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ , అనంతరం *రీచార్జ్ బోర్‌వెల్*, *కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్* నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో చేపడుతున్న *కమ్యూనిటీ సోక్‌పిట్* పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ,* సూపర్ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ప్రతి వర్షపు నీటి బొట్టును భూగర్భంలోకి ఇంకించి నీటి నిల్వలను పెంచడం అత్యంత అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీ.బీ.జీ.ఆర్.ఏ.ఎం. (VBGRAM) నిధులతో గ్రామాల్లో *ఫార్మ్‌పాండ్లు, సోక్‌పిట్లు, ఉట్టకుంటలు* నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పొలాల్లో ఫార్మ్‌పాండ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫార్మ్‌పాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం వల్ల పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందుబాటులో ఉండటంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరిగి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం కోరుట్ల మండలం *జోగిన్‌పెల్లి గ్రామంలో* నిర్మాణంలో ఉన్న *వీవో భవనం* మరియు *అంగన్‌వాడీ కేంద్రం* నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.వీవో భవనం, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీ ఉండరాదని, నిర్మాణాలన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపిడివో రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.




0 Comments