రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు త్వరలో మహర్దశ.. 19 వినతులు అందించిన ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, జూలై 28:
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల పాల్గొని, కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేయడానికి సంబంధించిన పలు కీలక అంశాలపై 19 వినతి పత్రాలను మంత్రి గారికి సమర్పించి, ప్రత్యేకంగా చర్చించారు.
కోరుట్ల నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులను బదిలీ చేయకుండా కొనసాగించాలని మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారిని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల గారు ప్రత్యేకంగా కోరారు. ఇప్పటికే వైద్యుల కొరతతో ప్రజలకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం సేవలందిస్తున్న వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని వివరించారు. అందువల్ల కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి మరియు నియోజకవర్గంలోని ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల్లో పనిచేస్తున్న వైద్యులను యథాతథంగా కొనసాగిస్తూ, ఖాళీ పోస్టులను అదనపు నియామకాల ద్వారా భర్తీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఏరియా ఆసుపత్రి మరియు మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు. కోరుట్ల ఆసుపత్రికి ENT, ICU, SNCU, ఆపరేషన్ థియేటర్, ఆర్థోపెడిక్, సర్జికల్ పరికరాలు, అలాగే మెట్‌పల్లి ఆసుపత్రికి OT హైడ్రాలిక్ టేబుల్స్, OT ల్యాంపులు, Boyle’s Apparatus, 600 LPM PSA ఆక్సిజన్ జనరేటర్, 60 KV జనరేటర్ తదితర అత్యవసర వైద్య పరికరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్‌పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్, సాంకేతిక, పరిపాలనా సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఖాళీల కారణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బందిని 34 నుండి 55 మందికి, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 31 నుండి 54 మందికి పెంచి శానిటేషన్ వర్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రమైన ఆసుపత్రి వాతావరణం, సంక్రమణ వ్యాధుల నివారణకు ఇది అత్యవసరమని వివరించారు.
కోరుట్ల 100 పడకల ఏరియా ఆసుపత్రికి అవసరమైన క్యాడర్ స్ట్రెంగ్త్‌ను పెంచడంతో పాటు, మెట్‌పల్లి 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అందుకు అనుగుణంగా అదనపు వైద్య, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌ను మంజూరు చేయాలని, అలాగే నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించే ముందు అవసరమైన సిబ్బంది, బెడ్లు, వైద్య పరికరాలు, ల్యాబ్ సౌకర్యాలు, మందులు, ఫర్నిచర్ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థ, రెండు బోర్‌వెల్లు, కోరుట్ల నియోజకవర్గంలోని 17 ఆరోగ్య ఉపకేంద్ర భవనాల పూర్తి కోసం అదనపు నిధులు, కోరుట్ల మండలం మాధాపూర్‌లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు తదితర ప్రతిపాదనలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా కోరుట్ల మండలంలోని మాధాపూర్ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను మంజూరు చేయాలని మంత్రి గారిని కోరారు. ప్రస్తుతం కోరుట్ల మండల ప్రజలందరూ ఐలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుండటంతో రోగుల రద్దీ అధికమై, గ్రామీణ ప్రజలు ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు వైద్య సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మాధాపూర్‌లో కొత్త పీహెచ్‌సీ ఏర్పాటు చేస్తే కోరుట్ల మండల ప్రజలకు మరింత చేరువలో నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి దామోదర రాజనర్సింహ కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు..



0 Comments