అన్యాయంగా సస్పెండ్ చేసిన దళిత ఎస్సై ఎం. చిరంజీవిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు కోరుట్ల అంబేద్కర్ యువజన సంఘాల వినతి
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై 25:
కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దళిత అధికారి ఎం. చిరంజీవిని ఎలాంటి సమగ్ర విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం అన్యాయమని కోరుట్ల నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను ఆశ్రయించారు.
శనివారం కోరుట్ల కు వచ్చిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.
అనంతరం కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈమధ్యనే మెట్ పల్లిలో హత్యకు గురైన కర్రే సునీత కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చిందనే ప్రచారం వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. సునితను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా గంగారెడ్డి అడ్డుకున్నారని తెలిపారు.
అయితే, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా, దళిత అధికారిగా పనిచేస్తున్న ఎం. చిరంజీవిపై చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. అసలు బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఎలాంటి తప్పు నిరూపితం కాకముందే ఎస్సై చిరంజీవిని సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
కాబట్టి ఎం. చిరంజీవిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగే బాధితురాలి కర్రే సునిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లో సునిత ను ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగారెడ్డిపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, వుయ్యాల నర్సయ్య, ఎమ్మార్పీఎస్ జర్నలిస్టు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్ పల్లి లక్ష్మణ్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు ఉయ్యాల శోభన్,మాల మాదిగ కుల సంఘాల నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, శనిగారపు రాజేష్, బలిజ రాజ శేఖర్, పసులు చిన్నయ్య, మోర్తాడ్ రాజశేఖర్, సామల్ల వేణు, సత్యం, నారాయణ తదితర దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



0 Comments