భూ భారతి రీ-సర్వే ద్వారా భూముల హక్కులకు శాశ్వత భద్రత రైతులు పూర్తి సహకారం అందించాలి
సంగెం గ్రామంలో భూ భారతి రీ-సర్వే అవగాహన సదస్సు - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై 24 :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ-సర్వే కార్యక్రమం శుక్రవారం కోరుట్ల మండలం సంగెం గ్రామంలోని సంగమేశ్వర ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ రీ-సర్వే ద్వారా గ్రామంలోని అన్ని భూములను శాస్త్రీయ పద్ధతిలో కొలిచి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మ్యాపులను రూపొందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు చురుకుగా పాల్గొని సర్వే బృందానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భూ భారతి రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దు (Village Boundary)ను శాశ్వతంగా నిర్ధారిస్తారు. అనంతరం గ్రామ కంఠం (ఇళ్ల విస్తీర్ణం ఉన్న ప్రాంతం)లోని ప్రతి ఇంటిని ఆధునిక సర్వే పరికరాల ద్వారా మళ్లీ కొలిచి పాయింట్లు నమోదు చేసి, గ్రామంలోని ఇళ్ల సరిహద్దులను ఖరారు చేస్తారు.
తదుపరి దశలో ప్రభుత్వ భూముల సరిహద్దులను గుర్తించి సర్వే నిర్వహిస్తారు. ఇందులో ప్రభుత్వానికి చెందిన చెరువులు, కాలువలు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, పోరంబోకు భూములు మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఖచ్చితంగా మ్యాపింగ్ చేసి నమోదు చేస్తారు. గ్రామ సరిహద్దు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల సర్వే పూర్తయిన తర్వాత పట్టా భూముల రీ-సర్వే ప్రారంభమవుతుంది. ఇందుకోసం ప్రతి రైతుకు భూ భారతి చట్టం ప్రకారం 9(1) నోటీసు జారీ చేసి ముందస్తు సమాచారం అందజేస్తారు. నోటీసులో పేర్కొన్న తేదీ, సమయానికి రైతులు తప్పనిసరిగా తమ భూమి వద్ద హాజరుకావాలని సూచించారు.
సర్వే సమయంలో రైతు ప్రస్తుతం అనుభవిస్తున్న (ఎంజాయ్మెంట్‌లో ఉన్న) భూమి ఆకృతి, హద్దులు, మూలల పాయింట్లు, భూమి యొక్క వాస్తవ స్థితిని ఆధునిక సర్వే పరికరాల సహాయంతో నమోదు చేసి, ఖచ్చితమైన కో-ఆర్డినేట్లతో కొత్త డిజిటల్ మ్యాపులు రూపొందిస్తారు.
రైతులు గ్రామ సరిహద్దు నిర్ణయించే సమయంలో, తమ భూముల సర్వే నిర్వహించే సమయంలో తప్పనిసరిగా అక్కడే ఉండి, తమ భూమి హద్దులను స్పష్టంగా చూపించి సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు. ప్రజల సహకారంతోనే భూ భారతి రీ-సర్వే కార్యక్రమం పారదర్శకంగా, వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు.
ఈ అవగాహన సదస్సుకు గ్రామ ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై భూ భారతి రీ-సర్వేపై పూర్తి అవగాహన పొందాలని విజ్ఞప్తి చేశారు. భూములపై భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారించి, ప్రతి భూయజమానికి స్పష్టమైన హక్కులు కల్పించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.
సంగెం గ్రామంలో పంచాయతీ భవనం, వివో భవనం, డ్రైనేజీ ల నిర్మాణం కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న వివో భవనాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపిడివో, రెవెన్యూ అధికారులు, సర్వేయర్ కుమారస్వామి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.




0 Comments