రైతులు, ప్రజలను కాపాడుకుందాం : సమష్టిగా మిషన్ మోడ్ లో సూపర్ ఎల్‌నినో ను ఎదుర్కొందాం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామ గ్రామానా రైతులకు అవగాహన కల్పించాలి
వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు :: పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
రాజకీయాలకు అతీతంగా సూపర్ ఎల్‌నినో సవాల్‌ను ఎదుర్కొందాం - జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లతో నిరంతర పర్యవేక్షణ
వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసి పట్టాలి : ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టాలి
ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే ప్రజల భాగస్వామ్యమే కీలకం :: వర్షపు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి
కరోనా స్ఫూర్తితో సూపర్ ఎల్‌నినోను అధిగమిద్దాం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష సమావేశం
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, కరీంనగర్, జూలై 19:
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపనున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కొని రైతులు, ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్‌లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి *తుమ్మల నాగేశ్వరరావు* పిలుపునిచ్చారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు అందరూ ఒక్కటై పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో *సూపర్ ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై * నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి *దుద్దిళ్ల శ్రీధర్ బాబు*, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి *పొన్నం ప్రభాకర్*, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి *అడ్లూరి లక్ష్మణ్ కుమార్* ప్రభుత్వ విప్‌లు **ఆది శ్రీనివాస్*, *చింతకుంట విజయ రమణారావు* స్పెషల్ చీఫ్ సెక్రటరీ *మహేష్ దత్ ఎక్కా*, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి *సురేంద్రమోహన్*, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు.
సమావేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా, రైతులకు అవగాహన కార్యక్రమాలు, జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో చేపడుతున్న చర్యలను సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖల అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు.
*మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,* ప్రస్తుత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా *సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో*, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత *ఏప్రిల్ నెల నుంచే* రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న *రైతు నేస్తం* కార్యక్రమాలు, గ్రామసభల ద్వారా రైతులకు సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే రైతులకు వివరించి నష్టాలను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై కూడా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదుకాకపోవచ్చని, అందువల్ల ముందస్తు కార్యాచరణతోనే రైతులు, ప్రజలను రక్షించగలమన్నారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలపై పడే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని *ఏ రిజర్వాయర్ నుంచీ సాగునీటిని విడుదల చేసే పరిస్థితి లేదని*, రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో *10 మీటర్ల వరకు తగ్గిపోయాయని*, రాష్ట్రంలోని జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని అప్రమత్తం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.
ప్రస్తుతం పడుతున్న చిరు జల్లులను చూసి రైతులు తొందరపడి ఎక్కువ నీటి అవసరమయ్యే పంటల వైపు వెళ్లవద్దని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని *తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కందులు, నువ్వులు, వేరుశనగ, ఆయిల్ పామ్, ఉద్యానవన (హార్టికల్చర్) పంటలు* నేల స్వభావానికి అనుగుణంగా సాగు చేయాలని సూచించారు.
గ్రామ గ్రామాన రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి రైతుకు భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభలు, రైతు వేదికలు, రైతు నేస్తం కార్యక్రమాల ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని సూచించారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో *తాగునీటి వినియోగానికే అత్యధిక ప్రాధాన్యత* ఇస్తున్నామని, రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన *విత్తనాలు, ఎరువులు* రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచామని తెలిపారు.
వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించాలని ఆదేశించారు. *సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి*, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు.
తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటి వినియోగంలో పొదుపు పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని ఆదేశించారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు వస్తాయనే ఆశతో రైతులు ఎవరూ *వరి నాట్లు వేయడానికి తొందర పడవద్దని* మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు పరిస్థితిని బాగా అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగును విరమించి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే *తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా* నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ ప్రకృతి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.
*మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,*
ఎల్‌నినో ప్రభావం రాష్ట్రం ముందున్న అతిపెద్ద సవాల్ అని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు, ప్రజలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ముందస్తు ప్రణాళికతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందన్నారు. జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాలో ప్రత్యేక *కంట్రోల్ రూమ్* ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి రైతులు, ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి అందించి ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు గ్రామ గ్రామాన పర్యటిస్తూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా ఇదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న శ్రీధర్ బాబు, వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సంక్షోభ నివారణ చర్యలను నిరంతరం కొనసాగిస్తూ, ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
*మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,* సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా *ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని*, ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలో *రైన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి* చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలందరూ ఇంకుడు గుంతలు నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనిని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా *ప్రజా ఉద్యమంగా* తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కలిసి ఉమ్మడి గొంతుకతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. ప్రకృతి విపత్తును సమిష్టిగా ఎదుర్కోవాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని *ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ* దేవాలయాల్లో *వరుణ యాగాలు, ప్రత్యేక పూజలు* నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రజలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు విడుదల చేసి రాష్ట్రానికి అండగా నిలవాలని మంత్రి కోరారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు.
*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,*
కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమిష్టిగా పనిచేసి సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించినట్లే, ఇప్పుడు *సూపర్ ఎల్‌నినో* కారణంగా ఏర్పడుతున్న విపత్కర పరిస్థితులను కూడా అదే స్ఫూర్తితో సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులు, ప్రజలను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, గ్రామ గ్రామాన రైతులకు సూపర్ ఎల్‌నినో ప్రభావం, వాస్తవ పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పరిస్థితులను దాచిపెట్టకుండా రైతులకు స్పష్టంగా వివరించి, శాస్త్రీయ సూచనలు అందించాలని పేర్కొన్నారు. ఎక్కువ నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా *మొక్కజొన్న, కందులు, పప్పుధాన్యాలు, ఇతర తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు* సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే రైతులు పెద్దఎత్తున *ఆయిల్‌పామ్ సాగు* వైపు మొగ్గు చూపేలా అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజల్లో ధైర్యం నింపాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం రైతులు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ* గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రైతులను చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా కందుల సాగును ప్రోత్సహించాలని, ప్రస్తుతం మార్కెట్లో కందులకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆ దిశగా ఆలోచిస్తే ఆర్థికంగా లాభపడతారని అన్నారు.
మిడ్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 7.4 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పేర్కొన్న ఆయన, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్రహారం, రుద్రారం పంపింగ్ స్టేషన్లలో అదనపు మోటార్లు ఏర్పాటు చేసి స్టాండ్‌బై వ్యవస్థ సిద్ధంగా ఉంచాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
*ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ,* ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రకృతి విపత్తులు, కరువు పరిస్థితులపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామసభలు, రైతు వేదికల ద్వారా ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రాధాన్యాన్ని వివరించాలని సూచించారు. వరికి బదులుగా కందులు, నువ్వులు, జొన్నలు, పప్పుధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఆగస్టు వరకు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం ఉందని తెలిపారు.
పప్పుధాన్యాల కొరత ఉన్న నేపథ్యంలో కందులు, నువ్వులకు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల వరకు మద్దతు ధర లభిస్తోందని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిరంతరం అండగా ఉంటుందని, రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ కుమార్ తదితర ప్రజా ప్రతినిధులు, మేయర్లు, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.




0 Comments