గోదావరి పుష్కరాల జరిగే జిల్లాల ఎస్పీలతో డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్ ఐపిఎస్ వీడియో కాన్ఫరెన్స్ - ప్రజా దండోర

 


గోదావరి పుష్కరాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి


పుష్కరాల జరిగే జిల్లాల ఎస్పీలతో  డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్ ఐపిఎస్ వీడియో కాన్ఫరెన్స్


డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, జగిత్యాల, జూలై 18:


రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని  డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్ జిల్లా ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో గోదావరి పుష్కరాల జరిగే జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.



ఈ సందర్భంగా  డీజీపీ (లా అండ్ ఆర్డర్)  మాట్లాడుతూ..  పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని తెలిపారు.మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, గల్లంతయ్యే వారిని గుర్తించేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నదిలో స్నానాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు  ఏర్పాటు చేయడంతో పాటు, ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, వైద్య శాఖలతో సమన్వయం పెంచి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని అన్నారు.  పుష్కర ఘాట్లు, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని, అవసరమైన చోట డ్రోన్ నిఘాను వినియోగించాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం పెంచుకుని భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. 



ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, రామ్ నరసింహ రెడ్డి, సురేష్ బాబు, ఎస్.ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments