మన ఇంటి నుండే మార్పు రావాలి చెత్త సేకరణతో జగిత్యాలను పరిశుభ్రమైన పట్టణంగా మారుద్దాం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ - ప్రజా దండోర




మన ఇంటి నుండే మార్పు రావాలి చెత్త సేకరణతో జగిత్యాలను పరిశుభ్రమైన పట్టణంగా మారుద్దాం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్


వ్యాధుల నివారణకు పరిశుభ్రతే ప్రధాన ఆయుధము జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్


ప్రజా దండోర న్యూస్ / బొమ్మెన శ్రీహరి, జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 10 :


జగిత్యాలలో ప్రజాపాలన వార్డు సభలలో పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ చీరలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, చైర్ పర్సన్ సమీండ్ల వాణి లు కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేశారు.


జగిత్యాల పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన వార్డు సభలు మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు పట్టణంలోని పలు వార్డులలో ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొన్నారు



ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, దీంతో చెత్త నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అన్నారు. అలాగే మెడికల్ వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. కాలువలు, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తి వంటి సమస్యలను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా ఓటు హక్కు ఉన్న వారందరూ SIRలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ సముదాయాల వద్ద ప్రైమరీ స్కూల్, హెల్త్ సెంటర్ మొదలైనవి ప్రారంభించుకోవడం జరిగిందని,జగిత్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా, ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణ వ్యవస్థను, వృక్ష, జంతుజాలాన్ని దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ మరియు కాలుష్య వ్యర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన నిర్లక్ష్యం వల్ల తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి ఇల్లూ ఒక పునాదిగా మారాలని కోరారు. ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు మరియు హానికరమైన కెమికల్ వ్యర్థాలుగా నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని స్పష్టం చేశారు.

వంటగది వ్యర్థాలైన తడి చెత్త ద్వారా మేలైన ఎరువుల తయారీ జరుగుతుందని, ప్లాస్టిక్ మరియు పేపర్ల వంటి పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపవచ్చని వివరించారు. చిన్నపిల్లల డైపర్లు, ప్యాడ్ల వంటి శానిటరీ వ్యర్థాలను, అలాగే బ్యాటరీలు, కెమికల్ బాటిళ్ల వంటి ప్రమాదకర వ్యర్థాలను విడిగా ఇవ్వడం ద్వారా పారిశుధ్య కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పట్టణంలోని వార్డులలో ఈ సరికొత్త 4-డబ్బాల చెత్త సేకరణ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. మనం కలిపి ఇచ్చే చెత్త వలన డబుల్ బెడ్ రూమ్ సముదాయాల వాసులకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు.  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధుల నివారణకు పరిశుభ్రతే ప్రధాన ఆయుధమని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను విడదీసి ఇవ్వడం వల్ల చెత్త శాస్త్రీయ నిర్వహణకు అవకాశం కలుగుతుందని, ప్రజలు ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలు, ఖాళీ స్థలాలు, కాలువలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చన్నారు. వాడిన సూదులు, మందుల సీసాలు, వైద్య సంబంధిత వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా పారవేయాలని, ప్రజారోగ్య పరిరక్షణలో ఇది ఎంతో ముఖ్యమని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే ఓటు హక్కు ఉన్న వారందరూ SIRలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.18 ఏళ్లు నిండిన అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందజేస్తున్నామని, వార్డు సభలలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు మరియు హానికరమైన కెమికల్ వ్యర్థాలుగా నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని స్పష్టం చేశారు. వంటగది వ్యర్థాలైన తడి చెత్త ద్వారా మేలైన ఎరువుల తయారీ జరుగుతుందని, ప్లాస్టిక్ మరియు పేపర్ల వంటి పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపవచ్చని తెలిపారు.



కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామిండ్ల వాణి, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, జగిత్యాల అర్బన్ తహసిల్దార్ రామ్మోహన్, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది మహిళ సంఘాల సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments