తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ డా. పేట భాస్కర్ ప్రస్థానం - ప్రజా దండోర

 


తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ డా. పేట భాస్కర్ ప్రస్థానం మరుపురానిది


 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలతో.. ప్రత్యేక కథనం 


 ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ, జూన్ 2 : 


తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని విడవకుండా ముందుకు సాగిన ప్రయాణమే తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్  ఉద్యమ ప్రస్థానం మరుపురానిది.

అప్పటికే ''ప్రజా దండోర'' పత్రిక ఎడిటర్ గా 2006 నుండి 2009 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంగా పత్రికను దశదిశలా విస్తరింప చేయడంతో పాటు జర్నలిస్టు సంఘాలతో పని చేస్తూ తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను తన కవితలు.. ఆర్టికల్ ల ద్వారా ప్రజలను చైతన్యపరచడంతో పాటు పేట భాస్కర్ దళిత బహుజన వర్గాలను నేరుగా ఉద్యమం వైపు మళ్లించడానికి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం తో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై అనేక బహిరంగ సభలు, నియోజకవర్గ సదస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జన్మస్థలమైన కోరుట్లలో సైతం జేఏసీ కన్వీనర్ తునికి రాఘవులుతో కలిసి స్థానిక ఉద్యమ నాయకులతో తెలంగాణ సాధన కోసం కోరుట్లలో 125 రోజుల దీక్షలు చేయడం మరుపురాని ఘట్టం. 




అంతే కాకుండా 2009 డిసెంబర్ 24 న ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పడిన మరుసటి రోజునే డిసెంబర్ 25 న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి నాయకత్వంలో ఆయన చైర్మన్గా, కపిల్వాయి దిలీప్ కుమార్, బెల్లయ్య నాయక్, గజ్జల కాంతం, వి ప్రకాష్, పేట భాస్కర్, కంసాల శ్రీనివాస్ లు రాష్ట్ర వైస్ చైర్మన్లుగా మరికొందరితో కలిసి తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సంఘాల జేఏసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులుగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు లాంటి మేధావులతో కలిసి అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు.  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది పార్టీలను కేంద్రంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలుకు పిలువగా వారిని ప్రజలను అప్రమత్తం చేసేందుకు 2010 జనవరి 5 న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేపట్టడం అప్పుడు పార్లమెంటు వద్ద జరిగిన లగడపాటి రాజగోపాల్ తగువులో ఆయనను వురికిపించిన సంఘటనలో భాగస్వామ్యం కావడం ఉద్యమంలో మర్చిపోలేని జ్ఞాపకం. 



ఉద్యమ క్రమంలో అనేక సభలు సమావేశాల అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఇనుకొండ తిరుమలి అక్కడే వుంటూ కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యమ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తూ అక్కడే వుండడంతో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా గజ్జెల కాంతం, రాష్ట్ర వైస్ చైర్మన్ గా పేట భాస్కర్ తో పాటు మరికొందరి నాయకులను నియమించడంతో మరింత నూతన ఉత్సాహంతో అనేక ఉద్యమ రూపాల్లో గజ్జెల కాంతంతో కలిసి ఉద్యమించారు. అన్ని పార్టీలతో ఐక్య సదస్సులు, ఐక్య భోజనాలు, ఉద్యమ రథసారథి కేసిఆర్ తో పాటు మహానీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్ లతో ఇంద్ర పార్క్ వద్ద, జుబ్లీహాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, రాష్ట్ర సదస్సులు నిర్వహించి జిల్లాల వారీగా ప్రజా గర్జనల పేరిట ప్రజాసంఘాల జేఏసీ యావత్ కుల, ప్రజా సంఘాలను ఏకం చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమ ఆందోళనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే కార్యక్రమాలతో ప్రజాసంఘాల జేఏసీ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించింది. 


అంతే కాకుండా అప్పటి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయించడంలో ప్రజాసంఘాల జేఏసీ కీలక పాత్ర పోషించినది చరిత్ర మర్వని సాక్ష్యం. 




తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై 2010 ఫిబ్రవరి 10 న కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీకి సైతం ప్రజాసంఘాల జేఏసీ తెలంగాణ సమాజం కోసం, అమరులైన బిడ్డల కోసం నీళ్లు నిధులు నియామకాలపై అనగారిన దళిత బహుజనుల పక్షాన జుబ్లీహాల్లో జూన్ 8 2010న ప్రత్యేక సమావేశం ద్వారా శ్రీ కృష్ణ కమిటీకి నివేదికలు ఇచ్చి ప్రజల స్థితిగతులు తెలిపింది ప్రజాసంఘాల జేఏసీ.  


2011 ఫిబ్రవరి17 నుంచి 16 రోజుల పాటు ఉద్యోగుల సహాయ నిరాకరణ, మార్చి10 న మిలియన్ మార్చ్, సెప్టెంబర్13 నుంచి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మె, సెప్టెంబర్ 24, 25 సడక్ బంద్, సెప్టెంబర్ 30 న సాగర హారం, రైల్ రోకో, వంటావార్పు లాంటి కార్యక్రమాలతో అన్ని ఉద్యమ సంఘాలు, జనమంతా ఏకమై మహత్తర తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపిన ప్రజలకు..

 



కేంద్రం దిగివచ్చి పార్లమెంట్ పక్రియలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా విడిపోయి 29 వ రాష్ట్రంగా జూన్ 2 / 2014 న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. అదే క్రమంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన శ్రీమతి సోనియా గాంధీకి అభినందన కృతజ్ఞత సభను ఇందిరా పార్క్ లో ఘనంగా నిర్వహించి దానిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఘనత కూడా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీకే దక్కుతుంది.  ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు ఏలిన కెసిఆర్ పాలనలో ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వ ఫలాలు, ఫించన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉద్యమకారుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ''కే కే'' కమిటీ వేయడం శుభసూచకం. 




ఇకనైనా నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి అందించవలసిన ఫలాలు అందించాలని ఈమధ్యనే ఉద్యమకారుల పక్షాన రాష్ట్ర జేఏసీ నేతలు గజ్జల కాంతం, పిడమర్తి రవి , పేట భాస్కర్ లతో పాటు వివిధ జిల్లాల కు చెందిన ఉద్యమ కారులతో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) వేం నరేందర్ రెడ్డి లను కలిసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కృషి చేయాలని వారిని, ప్రభుత్వాన్ని కోరారు. 




నేటి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతూనే నిరంతర ప్రస్థానంలో తెలంగాణ వచ్చాక కూడా నిరంతరాయంగా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా జిల్లాల వారీగా అనేక కార్యక్రమాల ద్వారా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అనేక సదస్సులు నిర్వహించడమే కాకుండా ఢిల్లీ జంతర్మంతర్లో రాజ్యాంగ రక్షణకై మూడు రోజులు దీక్షలు చేసిన ఘనత తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ దని ఇకమీదట సైతం ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పేట భాస్కర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలు, అవసరాలపై ఉద్యమించారో అ ఆకాంక్షలను అవసరాలను నేటి ప్రభుత్వం తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని పేట భాస్కర్ గుర్తు చేశారు.



సమాజహితం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం వేసిన ప్రతి అడుగు ఒక కొత్త అనుభవాన్ని, కొత్త పాఠాన్ని నేర్పిందని. కష్టాలు, విమర్శలు, అడ్డంకులు ఎన్నో ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగామని. ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చాలనే సంకల్పంతో ఉద్యమ బాటలో నడిచామని ఈ ప్రస్థానం కేవలం ఒక్కరిదే కాదని తనతో పాటు నడిచిన ప్రతి సహచరుడిది, ప్రతి కార్యకర్తది, వారి సహకారం, నమ్మకం, అండదండలతోనే ఈ ప్రయాణం విజయవంతమైందని పేర్కొన్నారు.


తెలంగాణ ఉద్యమం తన ప్రస్థానానికి దిశను చూపిందని ''ప్రజా దండోర'' పత్రిక తన మనోభావాలను, ప్రజల ఆకాంక్షలను- ప్రభుత్వ లక్ష్యాలను తెలిపే వారధిలా అవకాశం కల్పించిందని ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ, ప్రజల పక్షాన ఢీ అంటే ఢీ అంటూ మరింత ఉత్సాహంతో ప్రజా లక్ష్యపు అంచున ప్రయాణం కొనసాగిస్తున్నానని డాక్టర్ పేట భాస్కర్ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments