ధర్మపురి విద్యా అభివృద్ధికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేయూత, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రూ.10 కోట్ల డిగ్రీ కళాశాల నిర్మాణం
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషికి ఫలితం
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, జూన్ 24:
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో ధర్మపురిలో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ ఫలితంగా బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో HAL ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, HAL హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎ.వి. మురళీకృష్ణ, డీజీఎం (హెచ్‌ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్) ఎస్. సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా మౌలిక వసతుల కల్పన ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఈ డిగ్రీ కళాశాల వరంగా మారనుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని అన్నారు.
నూతన కళాశాల భవనం ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలతో నిర్మించబడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ యువతలో ఉన్నత విద్యపై ఆసక్తి పెరిగి, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు.
CSR నిధులను సామాజికాభివృద్ధికి వినియోగిస్తూ విద్యా రంగానికి HAL సంస్థ అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని పేర్కొంటూ, HAL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. రవి, యాక్సెసరీస్ కాంప్లెక్స్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం. సత్యనారాయణ, HAL హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామమోహనరావు, HAL హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ శ్రీ ఎ.వి. మురళీకృష్ణతో పాటు HAL యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మపురి ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని CSR నిధుల కింద ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సహకరించిన HAL సంస్థ ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మంత్రి ఓఎస్డీ వై.జె. విజయ్ కుమార్, జిల్లా అధికారులు, HAL ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments