పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంలో నీతి నిజాయితీతో పారదర్శకంగా విధులు నిర్వర్తించండి - రాష్ట్ర డిజిపి సి. వి. ఆనంద్ వెల్లడి.

పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంలో నీతి నిజాయితీతో పారదర్శకంగా విధులు నిర్వర్తించండి - రాష్ట్ర డిజిపి సి. వి. ఆనంద్ ఐపీఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి

డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)  సి.వి. ఆనంద్ ఐపీఎస్ గారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన ఈ తొలి సమీక్షా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవల అందజేత, పోలీసు శాఖ పనితీరు మెరుగుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.


ఈ వీడియో సమావేశంలో జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయం నుండి పాల్గొన్నారు. జిల్లా పరిధిలోని డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ అధికారులు తమ తమ కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.



ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి సి.వి. ఆనంద్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ విధులను అత్యంత నీతి, నిజాయితీ, పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీస్ అధికారికి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసింగ్‌లో నిష్పాక్షికత, వృత్తిపరమైన నైపుణ్యం, ప్రజల పట్ల గౌరవభావం ఉండాలని, ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూనే బాధితులకు వేగవంతమైన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ఆధునిక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, నేరాల దర్యాప్తులో నాణ్యత పెంచాలని పేర్కొన్నారు. అలాగే విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తన పాటించాలని, శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు.

Post a Comment

0 Comments