కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణే లక్ష్యంగా మొదటి రోజు నిరసన దీక్ష విజయవంతం- పాల్గొన్న బిజేపి నాయకులు- ప్రజా దండోర

 


కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణే లక్ష్యంగా మొదటి రోజు నిరసన దీక్ష విజయవంతం - పాల్గొన్న బిజేపి నాయకులు 

విఎల్టీలను రద్దు చేసి అవినీతికి పాల్పడ్డ మున్సిపల్ అధికారిని సస్పెండ్ చేయాలి 


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 21:


 కోరుట్లలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల్లో  నకిలీ దస్తావేజులతో అవినీతికి పాల్పడిన రియల్టర్లు, వారికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాటి పరిరక్షణే లక్ష్యంగా నిరసన దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, ఇప్పటికే పూజలు జరుగుతున్న మైసమ్మ తల్లికి పూర్తి స్థాయి దేవాలయం నిర్మించాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని, ప్రతీ ఏటా జరిగే మహిషాసుర మర్దిని ఉత్సవాలకు సంబంధించిన స్థలాన్ని యదావిధిగా కొనసాగించాలని  కోరారు.గడిబురుజుల ఖాళీ స్థలాలకు జారీ చేసిన విఎల్టీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మొదటి రోజు నిరసన దీక్ష విజయవంతం చేశారు.

ఈ నిరసనకు బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రముఖ వైద్యులు డా. అనూప్ రావు, ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, బిజేపి జిల్లా నాయకులు సుడవేని మహేష్ దీక్ష శిబిరం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడి స్థలాల రక్షణకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్ని వర్గాలతో చర్చించి కోరుట్ల బంద్ పిలుపుకు ప్లాన్ చేయాలని సూచించారు. ఆ స్థలాల రక్షణకు తమ పార్టీ నేరుగా ఉద్యమం లో పాల్గొంటుంది అని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్,  అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవం అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్ లు మాట్లాడుతూ గడి బురుజుల స్థలాలకు ఇచ్చిన విఎల్టీలను వెంటనే రద్దు చేయాలని, భూ అక్రమ దందాల నుండి ఈ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటం పూర్తిగా కోరుట్ల ప్రజల హక్కుల కోసం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. వీఎల్టీలు పూర్తిగా రద్దు చేయబడే వరకు, అలాగే గడిబురుజుల ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు అయ్యే వరకు ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రజలు, అన్ని పార్టీల నాయకులు భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

అలాగే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజా ప్రతినిధులు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గడిబురుజుల గ్రామకంఠ భూములు కోరుట్ల ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments