కోరుట్ల గడి బురుజుల స్థలాలపై వేసిన విఎల్టీలను రద్దు చేసి, కమీషనర్ను సస్పెండ్ చేయాలని అఖిలపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలోని గడి బురుజులు (గ్రామకంఠ / అబాది) స్థలాలపై వేసిన విఎల్టీలను రద్దు చేయాలని, గడిలను అనుకుని అక్రమంగా సృష్టించిన అభ్యంతరకరమైన ఇంటి నెంబర్ 6-1-63 కు సంబంధించిన 1994-95 రశీదు ఆధారంగా 2025- 26 దాదాపు 30 సంవత్సరాల పన్నును ఏకకాలంలో వసూలు చేసి అదే నంబర్ ఆధారంగా రియల్టర్లతో కుమ్మక్కై పరిధికి మించి 5,010 గజాల వరకు నకిలీ దస్తావేజులతో విఎల్టీలు వేసిన కమీషనర్ రియల్టర్లకు పరోక్షంగా రిజిస్ట్రేషన్ లకు అవకాశం ఇచ్చారని ఈ తతంగంలో సుమారు 80 లక్షల వరకు చేతులు మారాయని ప్రజలు, పాత్రికేయులు, పలు పార్టీల నాయకులతో పాటు అఖిలపక్ష ప్రజాసంఘాల ఆరోపణల మేరకు వెంటనే ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని, చారిత్రాత్మక కట్టడాల సంపద పై అవినీతికి పాల్పడిన కమీషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తేదీ : 21+04-2026 మంగళవారం రోజున పాత మున్సిపల్ కార్యాలయం వద్ధ చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలని అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
సోమవారం సి. ప్రభాకర్ భవన్‌లో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని గడి బురుజుల భవిష్యత్తుపై చర్చించారు.
సమావేశంలో ప్రధానంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గడి బురుజుల పరిధిలోని ఖాళీ భూములకు ఇచ్చిన వాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం నుంచి నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.
అదే విధంగా, గడి బురుజుల ఖాళీ స్థలాలను భూ అక్రమార్కుల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూములను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కూరగాయల మార్కెట్, పార్కు వంటి ప్రజా అవసరాల కోసం వినియోగించడంతో పాటు, ఇప్పటికే అక్కడ ఉన్న మైసమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే కోనేరును పునరుద్ధరించి, ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలను సంరక్షించాలని తీర్మానించారు.
ఈ నేపథ్యంలో నిర్వహించనున్న నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు మరియు యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు .
ఈసమావేశంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, డా. పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, చింతా భూమేశ్వర్, ఎం డి ముజీబుర్ రెహమాన్, సుతారి రాములు, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, కుంచెం శంకర్, శనిగారపు రాజేష్, పోతని సత్యం, న్యాయవాది బర్ల సంతోష్, గణేష్, వికాస్, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments