కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు - జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రజాదండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి / సురేష్ కొడిపెల్లి :
కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిసి వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు కొండగట్టులో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులు ప్రయాణించే మార్గాల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం వాహన పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తూ, నీడతో పాటు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సరిపడ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
కాలి నడకన వచ్చే దీక్ష భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, మాల ధారణ తీసివేత, కేశ ఖండన, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి కేశ ఖండన కేంద్రాలు, స్నానానికి షవర్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
భక్తుల భద్రత దృష్ట్యా 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, కోనేరులోని నీటిని శుభ్రపరచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు.
రాత్రివేళల్లో నడిచి వచ్చే భక్తులకు రేడియం స్టిక్కర్లు పంపిణీ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
పారిశుధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి చేపడతారని తెలిపారు. భక్తులకు ప్రసాదం అందించేందుకు తగిన సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆర్డీవో పి. మధుసూధన్, ఆలయ ఈఓ అంజనా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.


0 Comments