పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలి
- కేంద్ర మంత్రికి తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శేర్ నర్సారెడ్డి వినతి
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలోని పసుపు బోర్డుకు కేంద్ర నిధులను కేటాయించేలా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి నిధులను కేటాయించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు న్యూఢిల్లీలోని సమాచార భవన్ లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆయన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నిధుల కేటాయింంపులు జరుపకపోవడం విచారకరమన్నారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని నర్సారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నిధుల కేటాయింపుపై ఏ మాత్రం స్పష్టత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అధికంగా పన్ను చెల్లిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో పూర్తిగా మొండి చెయ్యి చూపిందన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.10 వేల కోట్ల ఎగుమతులకు అవకాశాలు కల్పిస్తామని స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించినప్పటికీ, ఆ దిశగా చర్యలు శూన్యమని అన్నారు.
తెలంగాణ పసుపు రైతుల భవిష్యత్తును, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి పసుపు బోర్డుకు కేంద్ర నిధులను కేటాయించేలా తగు కృషి చెయ్యాలని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు శేర్ నర్సారెడ్డి విజ్ఞప్తి చేశారు.

0 Comments