మద్యం మత్తులో బైక్ నడిపి యువకుడి మృతికి కారణమైన నిందితుడికి 8 ఏళ్ల జైలు.. బైక్ యజమానికి రూ.20 వేల జరిమాన
మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :
మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక యువకుడి ప్రాణం తీసిన కేసులో జగిత్యాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చిన బైక్ యజమానికి రూ.20 వేల జరిమానా విదిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి శ్రీమతి రత్న పద్మావతి గారు తీర్పు వెలువరించారు.
వివరలోకి వెళ్తే ... 2022 ఆగస్టు 9న మెట్‌పల్లి మండలం వెంపేట గ్రామానికి చెందిన మరంపెల్లి నవీన్ కుమార్ మద్యం సేవించి, తన బంధువు మరంపెల్లి అంజయ్యకు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ (TS-21-L-3365) బైక్‌ను తీసుకొని అతివేగంగా యూసుఫ్‌నగర్ వైపు వెళ్లాడు.అతిగా వేగంగా వస్తున్న నవీన్ యూసుఫ్‌నగర్ క్రాస్ రోడ్ వద్ద ఎదురుగా వస్తున్న హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో గుండంపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి సాగర్ (22) అక్కడికక్కడే మృతి చెందగా, అతని తల్లి లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి శివరాత్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. శ్రీను కేసును దర్యాప్తు చేసి, నిందితుడి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో నిందితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వాహనం ఇచ్చినందుకు బైక్ యజమానిపై కూడా అభియోగాలు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి ఈ రోజున నిందితుడు A1. నవీన్ కుమార్ (డ్రైవర్) – 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా,A2 అంజయ్య (వాహన యజమాని) – లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు రూ.20,000 జరిమానా విదిస్తూ తీర్పునిచ్చారు.
మద్యం సేవించి వాహనం నడపడం అనేది కేవలం ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన మాత్రమే కాకుండా, ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అత్యంత ప్రమాదకరమైన చర్య అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తన ప్రాణం మాత్రమే కాదు, రహదారిపై ప్రయాణిస్తున్న ఇతర నిరపరాధుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తాడని తెలిపారు.ఇలాంటి ఘటనల్లో నిందితులకు చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించబడతాయని, జైలుశిక్షతో పాటు భారీ జరిమానాలు కూడా పడే అవకాశముందని హెచ్చరించారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తే, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే వాహన యజమానులు కూడా తమ వాహనాలను ఎవరికి ఇస్తున్నారో ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు లేదా మద్యం సేవించిన వ్యక్తులకు వాహన ఇవ్వడం చట్టపరంగా తప్పు మాత్రమే కాకుండా, ప్రమాదం జరిగితే వాహన యజమానికీ బాధ్యతలు మరియు శిక్షలు తప్పవని తెలిపారు.
కేసును సమర్థంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన మెట్‌పల్లి సి.ఐ ఎల్. శ్రీను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్. రామకృష్ణ రావు, CMS ఎస్.ఐ శ్రీకాంత్, CMS కానిస్టేబుల్ కిరణ్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ రంజిత్ కుమార్‌లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ అభినందించారు.

0 Comments