జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష


జిల్లాలో  మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి /  సురేష్ కొడిపెల్లి :

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు 11-02-2026న నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొని ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు సమర్పించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ విస్తృతంగా సమీక్షించారు.

ఓటరు స్లిప్‌ల పంపిణీ, బ్యాలెట్ బాక్స్‌ల నిల్వ కోసం స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్స్‌ల ధ్రువీకరణ, మార్క్ చేయబడిన కాపీ రోల్ తయారీ, ఎన్నికల సామగ్రి నిర్ణీత సమయానికి పంపిణీ పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సమయానుకూలంగా ఆహార ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పోలింగ్ స్టేషన్లను మున్సిపల్ సిబ్బంది పరిశీలించి పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల సౌకర్యం, తాగునీటి ఏర్పాట్లు వంటి మౌలిక వసతులు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ రోజున వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఏఎన్ఎం, ఆశ వర్కర్లు విధుల్లో ఉండేలా చూడాలని సూచించారు. భద్రతా పరమైన అన్ని చర్యలు చేపట్టి, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

పోలింగ్ అధికారులు (పిఓ) డైరీను కచ్చితంగా నిర్వహిస్తూ ప్రతి అంశాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సరైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి డిఏ, టిఏ చెల్లింపులు నిబంధనల ప్రకారం ఎలాంటి ఆలస్యం లేకుండా చేపట్టాలని తెలిపారు.

ప్రతి మున్సిపాలిటీలో ఒక పోలింగ్ స్టేషన్‌ను మోడల్ పోలింగ్ స్టేషన్‌గా ఏర్పాటు చేయడానికి మెప్మా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరుగనున్న ఎన్నికల ఏర్పాట్లపై స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.

Post a Comment

0 Comments