ప్రజా సేవలో చెరగని ముద్ర.. జువ్వాడి రత్నాకర్ రావు
తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవకు అంకితమైన తనయులు
జువ్వాడి నర్సింగ్ రావు, కృష్ణరావు, శేఖర్ రావులపై ప్రజల ఆశలు
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, అక్టోబర్ 04:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా ఆయన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధికి తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన రత్నాకర్ రావు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ప్రస్తుత జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచిపోయారు.
రత్నాకర్ రావు రాజకీయ ప్రస్థానం గ్రామస్థాయి నుంచి ప్రారంభమైంది. అప్పటి బుగ్గారం నియోజకవర్గంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన, అనంతరం 1981లో జగిత్యాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని విస్తరించారు. ధర్మపురి ఆలయ కమిటీ తొలి పాలక మండలి చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
1989లో తొలిసారి బుగ్గారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, అనంతరం 1999లో తిరిగి విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజా సంక్షేమం, ఆలయాల అభివృద్ధి, పరిపాలనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు.
కోరుట్ల అభివృద్ధిలో కీలక పాత్ర
రత్నాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో కోరుట్ల ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. వెటర్నరీ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కళాశాల, మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వంటి సంస్థల ఏర్పాటుతో పాటు వేలాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చిన ఘనత ఆయనకు దక్కుతుంది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోరుట్ల ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన అనంతరం కూడా రత్నాకర్ రావు ప్రజలతో తన అనుబంధాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా ప్రజలతో తన అనుబంధాన్ని మాత్రం ఆయన ఎన్నడూ కోల్పోలేదు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయులు
వృద్ధాప్యం కారణంగా క్రియాశీల రాజకీయాల నుంచి దూరమైన రత్నాకర్ రావు తన రాజకీయ వారసుడిగా తనయుడు జువ్వాడి నర్సింగ్ రావును ప్రజాజీవితంలోకి తీసుకువచ్చారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నర్సింగ్ రావు విజయం సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ప్రజల మధ్యనే కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగ్ రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు.
అదే విధంగా స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ జువ్వాడి శేఖర్ రావు, పీసీసీ సీనియర్ నాయకులు కృష్ణ రావులు కూడా తమ తండ్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రజా జీవితంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా రత్నాకర్ రావు
రాజకీయాల్లో పదవులు రావడం, పోవడం సహజమే అయినా.. ప్రజల కోసం చేసిన సేవలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని నిరూపించిన నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావు. సామాన్యులు, పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచే ఉంది.
2020 మే 10న రత్నాకర్ రావు కన్నుమూసినా.. ఆయన ఆలోచనలు, ప్రజాసేవా దృక్పథం, అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయన కుటుంబ సభ్యుల ద్వారా కొనసాగుతున్నాయి.
తండ్రికి తగ్గ తనయులుగా జువ్వాడి నర్సింగ్ రావు, కృష్ణ రావు, శేఖర్ రావులు ప్రజల్లో కొనసాగుతూ.. భవిష్యత్తులో జువ్వాడి రత్నాకర్ రావు ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.



0 Comments