ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ - తెలంగాణ ఆత్మగౌరవానికి చిరునామా - డా. పేట భాస్కర్

 




ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ - తెలంగాణ ఆత్మగౌరవానికి చిరునామా - డా. పేట భాస్కర్ 

త్యాగం, నిజాయితీ, ప్రజా ఉద్యమం.. ఇవే ఆయన జీవితానికి ప్రతీకలు..

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, సెప్టెంబర్ 27 :

తెలంగాణ నేలపై ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని. పదవులు, అధికారాల కంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన జీవితం నేటి తరానికి ఒక గొప్ప సందేశమని బాపూజీ జయంతోత్సవాల సందర్భంగా కోరుట్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి చిరునామైన కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా బాపూజీ అనేక దశల్లో ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొన్న ఆయన స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పోరాటాన్ని కొనసాగించారని కొనియాడారు.



ఆదివారం కోరుట్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ప్రభుత్వపరంగా మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతోత్సవాలకు బాపూజీ విగ్రహ కమిటీ చైర్మన్, పద్మశాలి కులోన్నతి సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జయంతి ఉత్సవాలలో కాంగ్రెస్, బిజెపి సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, డాక్టర్ వై అనూప్ రావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, డాక్టర్ జె ఎన్ వెంకట్, విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, కౌన్సిలర్లు ఇందూరి తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, ఎడ్ల రమేష్, పద్మశాలి కులోన్నతి సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, కార్యదర్శి బండ్ల రవికుమార్ నాయకులు గడ్డం మధు, ఆడేపు మధు, ఎంబేరి నాగభూషణం, జక్కుల ప్రసాద్, జిల్లా ధనంజయ్, గుడ్ల మనోహర్, మచ్చ కవిత, రాము, వినయ్, కాంగ్రెస్ నాయకులు అన్నం అనీల్, కొంతం రాజం, పండిత్ రాజేశ్వర్, ప్రజాసంఘాల నాయకులు ఎలిసెట్టి గంగారెడ్డి, ఇట్యాల రాజేందర్, మహమ్మద్ ముజాహిద్ లతో కలిసి పాల్గొన్న పేట భాస్కర్ పలువురు నాయకులు ప్రసంగిస్తూ..



తెలంగాణ కోసం పదవినే త్యజించిన నాయకుడు

కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ జీవితంలో మంత్రి పదవిని కూడా నిర్వహించారు. అయితే పదవి కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని భావించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టారు. అధికారాన్ని ఆశ్రయించకుండా ప్రజల ఆకాంక్షలకు అండగా నిలవడం ఆయన ప్రత్యేకత.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన వృద్ధాప్యంలోనూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ ఉద్యమానికి నైతిక బలాన్ని అందిస్తూ, వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేశారు.

ఉద్యమమే జీవితంగా..

కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. అది ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం, హక్కులతో ముడిపడిన అంశం. అందుకే తెలంగాణ సాధన కోసం తన జీవిత చివరి దశ వరకు ఆయన ఉద్యమించారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం ఆయన జీవన విధానంలో భాగమయ్యాయి.

నేటి యువతకు స్ఫూర్తి

ప్రస్తుత తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అనేక విలువలను నేర్పుతుంది. ప్రజా జీవితంలో ఉన్నవారు పదవులను లక్ష్యంగా కాకుండా ప్రజాసేవను లక్ష్యంగా చేసుకోవాలని ఆయన జీవితం చెబుతుంది.

నిజాయితీతో కూడిన ప్రజా సేవ, సామాజిక బాధ్యత, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ — ఇవే ఆయన జీవితం నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు.

నాయకత్వం అంటే కేవలం పదవిని పొందడం కాదని.. ప్రజల కోసం నిలబడటం, అవసరమైనప్పుడు త్యాగం చేయడం, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడటమే నిజమైన నాయకత్వమని కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నిరూపించింది.

చిరస్మరణీయమైన సేవలు

తెలంగాణ చరిత్రలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఒక ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిపోయింది. ఆయన ఆశయాలను గుర్తు చేసుకోవడం అంటే కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు పరిమితం కావడం కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, సామాజిక న్యాయం కోసం పనిచేయడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాలి.

ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే ధైర్యం..
అన్యాయంపై పోరాడే స్ఫూర్తి..
సమాజం కోసం త్యాగం చేసే మనస్తత్వం..

ఇవే కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితానికి నిజమైన వారసత్వం.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను నేటి తరానికి పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుని సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు..
ఆయన ఆశయాలకు జోహార్లు..

Post a Comment

0 Comments