మచ్చలేని మహానాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

 


మచ్చలేని మహానాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ప్రజా ఉద్యమాలకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం

– తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, సెప్టెంబర్ 21 : 

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలో ఆయన విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్ పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా డా. పేట భాస్కర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ మచ్చలేని మహానాయకుడని, స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు ప్రజల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని అన్నారు. పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం వదులుకుని తెలంగాణ కోసం పోరాటం కొనసాగించారు. బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల సమస్యలపై ఆయన విశేషంగా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమానికి తన నివాసమైన జలదృశ్యాన్ని వేదికగా అందించిన ఆయన పాత్రను పలువురు నాయకులు నేటికీ గుర్తుచేసుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత రంగంలో ఆయన సేవలను గుర్తిస్తూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టినట్లు అధికారికంగా పేర్కొంది.


ఈ కార్యక్రమంలో పద్మశాలి కులోన్నతి సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, పద్మశాలి సంఘం నేతలు గుడ్ల మనోహర్, ఆడెపు మధు, ప్రజా సంఘాల నాయకులు గుండేటి రవి, సుతారి రాములు, కుంచెం శంకర్, గుమ్మడి రమేష్ పసుల కృష్ణ ప్రసాద్, తిప్పిరి గంగాధర్ తో పాటు పలువురు నాయకులు, ప్రతినిధులు పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వర్ధంతి సందర్భంగా బాపూజీని స్మరించుకోవడం మాత్రమే కాకుండా, ఆయన ఆశయాలైన సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని డా. పేట భాస్కర్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments