గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్



గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్

సమాజంలో సమానత్వం, గౌరవం, వివక్ష రహిత వాతావరణానికి పోలీసుల వినూత్న ముందడుగు

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21:

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్  తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించిన ఎస్పీ గారు, గణేశ్ నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించనున్న 17  మంది ట్రాన్స్‌జెండర్లకు టీ-షర్ట్‌లను అందజేశారు.అనంతరం వారికి విధుల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు, మార్గదర్శకాలను అందించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బందితో కలిసి ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు.



ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేయడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి గౌరవం, మర్యాద, సమానత్వం కల్పించాలనే సానుకూల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం లభించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి బాధ్యతాయుతమైన విధుల్లో వారు పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేయడం అభినందనీయమని తెలిపారు.

జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిందని తెలిపారు. నిమజ్జన మార్గాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

గణేశ్ నిమజ్జనోత్సవానికి వచ్చే భక్తులు, ప్రజలు పోలీస్ శాఖ సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పీ పురుషోత్తం రెడ్డి,టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ట్రాన్స్‌జెండర్ల పాల్గొన్నారు.

Post a Comment

0 Comments