న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత వేగవంతంగా అందించాలంటే కోర్టులు–పోలీస్ సమన్వయం అత్యవసరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జాతీయ మెగా లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన న్యాయ శాఖ, పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19:
న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా అందించాలంటే కోర్టులు మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి అన్నారు.
ఈ దిశగా జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా కోర్టు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా జిల్లాలో తేదీ 12.09.2026 శనివారం నాడు నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయ శాఖ , పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులను జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు, పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, వాటి పురోగతి, దర్యాప్తు నాణ్యత, చార్జ్‌షీట్‌లను సకాలంలో దాఖలు చేయడం, సమన్ల అమలు, నాన్ బెయిలబుల్ వారెంట్‌ల (NBW) అమలు, సాక్షుల హాజరు, ఫోరెన్సిక్ నివేదికలు వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
కేసుల విచారణలో అనవసరమైన ఆలస్యం జరగకుండా పోలీస్ అధికారులు మరియు ప్రాసిక్యూషన్ విభాగం మరింత సమన్వయంతో పనిచేయాలని జిల్లా జడ్జి సూచించారు. కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడం, నోటీసులు మరియు సమన్లను వేగవంతంగా అందించడం, కేసు డైరీలు మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించడం ద్వారా న్యాయ ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు.అలాగే పోలీస్ అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది సమిష్టిగా కృషి చేసి, కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలసి రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం సాధ్యమవుతుందని అవగాహన కల్పించిన ఫలితంగా మొత్తం 2561 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.కేసుల పరిష్కారంలో చక్కటి సేవలందించిన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులను కోరారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తో పాటు జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


0 Comments