హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలి
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్, సెప్టెంబర్ 13 :
హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు నిర్వాహకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉత్సవాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
మండపాల వివరాలు పోలీసులకు ముందుగానే ఇవ్వాలి
గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో వారి వివరాలను నిర్వాహకులు స్థానిక పోలీస్ కమిషనరేట్‌కు అందించాలని సీఎం సూచించారు. ముందస్తు సమాచారం అందించడం వల్ల అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు అనుకోని పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా ఎక్కడెక్కడ గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే పోలీసులకు సమాచారం అందిస్తే ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే మండపాల నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ సదుపాయాన్ని పొందాలని సూచించారు.
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మల కోసం ఏర్పాట్లు చేస్తున్న తరహాలోనే గణేశ్ నిమజ్జనాలకు అవసరమైన సదుపాయాలను నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగేందుకు చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


0 Comments