కోరుట్లలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్


నిర్మాణంలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని త్వరలో ప్రారంభం చేయాలని ఆదేశాలు


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, సెప్టెంబర్ 10


కోరుట్ల పట్టణం లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్  పరిశీలించారు.


 ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్‌ఐఆర్‌ ఫారాల్లో నమోదైన వివరాల్లో తప్పులను ఎలా సరిచేస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు, ఇంకా ఎన్ని నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎన్ని కేసుల్లో సవరణలు పూర్తయ్యాయి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్ల జాబితాలో ఇంటిపేరు, ఓటరు పేరు, ఫొటో తదితర వివరాల్లో తేడాలు ఉన్నట్లయితే వాటిని నిబంధనల ప్రకారం సరిచేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హత కలిగిన వారి పేర్లు తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఫొటోల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయడంతో పాటు, పేరు లేదా ఇంటిపేరులో మార్పులు అవసరమైతే సంబంధిత ఆధారాలను పరిశీలించి సవరణలు చేయాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు జారీ చేసిన అనంతరం సంబంధిత ఓటర్లకు విచారణ (హియరింగ్‌) నిర్వహిస్తున్నారా, ప్రతిరోజూ ఎంతమంది విచారణకు హాజరవుతున్నారు, వారి స్పందన ఎలా ఉందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విచారణకు ఓటర్లు హాజరవుతున్న తీరు, ప్రజల స్పందనపై అధికారులు వివరించారు. విచారణ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరవుతున్నారని తెలిపారు

అనంతరం కోరుట్ల లో నిర్మిస్తున్న  పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన  పనులను పరిశీలించి నిర్మాణ పనులను దాదాపు పూర్తి అయ్యాయని ప్రారంభానికి  కావలసిన పనులు వేగవంతం చేసి భవనాన్ని త్వరలో ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, జిల్లా వైద్య అధికారి సుజాత, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపిడివో, వైద్యులు, సూపర్ వైజర్ లు, బి.ఎల్.వో లు మరియు తదితరులు పాల్గొన్నారు.