"పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అంటూ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన మహనీయులు కాళోజి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల, సెప్టెంబర్ : 9
ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా సామాన్య ప్రజల సమస్యలను, సామాజిక రుగ్మతలను, అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తన కలం, గళం ద్వారా సామాజిక మార్పు కోసం కాళోజి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలపై కాళోజికి అపారమైన అభిమానం ఉండేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ, తెలంగాణ ఉద్యమానికి తన రచనలు మరియు పోరాటాల ద్వారా స్ఫూర్తిని అందించారని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవతా విలువల పరిరక్షణ కోసం కాళోజి నారాయణరావు జీవితాంతం పోరాడారని అన్నారు. ఆయన రచనలు నేటికీ సమాజాన్ని ఆలోచింపజేస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
కాళోజి ఆశయాలను, ఆయన చూపిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అన్నారు. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి.రాజ గౌడ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజి నారాయణరావుచిత్రపటానికి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.



0 Comments