గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

 


గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత.. మూడు షిఫ్టుల్లో సిబ్బంది నియామకం

నిమజ్జనానికి ముందే అన్ని శాఖల అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించాలి

సెప్టెంబర్ 23, 24 తేదీల్లో నిమజ్జనం.. ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు

పీస్ కమిటీ సమావేశంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్ల పై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్-08:

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.


 మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు.


జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో చేపడుతున్న ఏర్పాట్లపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లను, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారిని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జిల్లాలో పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని, అదే మంచి సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాన్ని జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించాలని తెలిపారు.


వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ఘనంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

 ట్రాఫిక్ నియంత్రణ, గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా, నిమజ్జన పాయింట్ల వద్ద ఏర్పాట్లు తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ కోరారు.


 ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు.

పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక సంస్థలు పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని నియమించి నిరంతరం పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పరిశుభ్రత విషయంలో పూర్తి సహకారం అందించాలని కోరారు.నిమజ్జన పాయింట్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలోని అన్ని నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు బ్యారికేడ్లు, క్రేన్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు, లైటింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి 108 వాహనం, పాము కాటు నివారణ మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం మానిటరింగ్ చేయాలని అన్నారు. 

నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లకు అదనపు డ్రైవర్లను, క్రేన్ మరమ్మతులు చేసే మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలి

నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. స్విమ్మర్లతో ముందుగానే చర్చించి వారికి షిఫ్ట్ వివరాలు తెలియజేయాలని సూచించారు.

*విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు*

గణపతి విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడా విద్యుత్ షాక్‌కు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా విద్యుత్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రతి గణేష్ మండపానికి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిస్తుందని, మండపాలకు విద్యుత్ కనెక్షన్‌ను లైన్‌మెన్ ద్వారా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రజలు అనవసరంగా స్వయంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని ప్రమాదాలకు గురికావద్దని కలెక్టర్ కోరారు.

మద్యం విక్రయాలపై కఠిన చర్యలు

నిమజ్జనం సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని, మద్య నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గణేష్ మండపాల సమీపంలో ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే మద్యం విక్రయాలను నియంత్రించాలని సూచించారు.

రూట్ మ్యాప్ ముందుగానే సిద్ధం చేయాలి

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన రూట్లలో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని, నిమజ్జన పాయింట్లకు అప్రోచ్ రోడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

విగ్రహాల తరలింపుకు అడ్డుగా వచ్చే చెట్ల కొమ్మలను తొలగించాలని, ఇంటర్నెట్, టీవీ కేబుళ్లు ఇబ్బంది కలిగించకుండా ముందుగానే సరిచేయాలని అన్నారు. జిల్లాలో ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి వినాయక విగ్రహ మండపం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని, ప్రతి మండపం వద్ద చేపట్టే ఏర్పాట్ల వివరాలను అధికారులు ముందుగానే తెలుసుకోవాలని అన్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రతి వినాయక మండపం వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్, హెల్త్ తదితర అత్యవసర సేవల కాంటాక్ట్ వివరాలతో కూడిన చిన్న పోస్టర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

*ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ  జిల్లాలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ప్రధానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందుగానే జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నిమజ్జనం రోజున ఊరేగింపు కార్యక్రమం, చివరి పూజా కార్యక్రమాలను సూర్యాస్తమయం కంటే ముందే సాయంత్రం ప్రారంభించేలా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేసుకోవాలని కోరారు. విగ్రహాల తరలింపు వాహనాలను ముందుగానే బుక్ చేసుకోవడంతో పాటు, విగ్రహం తరలించే రూట్ మ్యాప్‌ను ముందుగానే ఫైనల్ చేసుకోవాలని సూచించారు.

మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు సమన్వయంతో నిమజ్జన రూట్ మ్యాప్‌ను ఖరారు చేయాలని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు వివాదాస్పద ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

వినాయక మండపాల సమీపంలో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులు ఉంటే మద్యం విక్రయాలను నియంత్రించాలని, బెల్ట్ షాపుల సమాచారాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే పోలీసులకు అందించాలని ఆదేశించారు.

నిమజ్జన పాయింట్ల వద్ద సమృద్ధిగా తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, ఆర్టీసీ నుంచి అవసరమైన డ్రైవర్లు, మెకానిక్‌లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. 

ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను శాంతియుతంగా విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి. రాజ గౌడ్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఆర్డీవోలు, డిఎస్పి లు, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు, పీస్ కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments