దళిత స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం - డా. పేట భాస్కర్


స్పీకర్‌ను దుర్భాషలాడిన తాత మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి

శాసనసభ గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి

దళిత స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం - డా. పేట భాస్కర్ 

ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్, సెప్టెంబర్ 7 :


తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కలిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను దుర్భాషలాడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డా. పేట భాస్కర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా డా. పేట భాస్కర్ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ పదవి పట్ల ప్రతి ప్రజాప్రతినిధి గౌరవం, సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సభా వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ, స్పీకర్‌ను వ్యక్తిగతంగా దూషించడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

కేవలం దళితుడు అనే కారణంతోనే స్పీకర్‌ను చులకనగా చూసే ధోరణి ఉంటే అది మరింత ఆందోళనకరమని డా. పేట భాస్కర్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గౌరవాన్ని కాపాడటం శాసనసభ బాధ్యత అని పేర్కొన్నారు.

119 మంది ఎమ్మెల్యేలకు దిక్సూచిగా వ్యవహరించే స్పీకర్ పదవికి గౌరవం ఉండాలంటే, సభా మర్యాదలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాత మధు సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో సభా గౌరవం, రాజ్యాంగ విలువలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు అత్యంత కీలకమని, వీటిని కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కట్టుబడి ఉండాలని డా. పేట భాస్కర్ సూచించారు.


Post a Comment

0 Comments