కోరుట్లలో గడి మైసమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం
గొర్రె పొట్టేలు, బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ – భారీగా తరలివచ్చిన కుల సంఘాల ప్రతినిధులు, భక్తులు
గడి స్థలాల పరిరక్షణ ఉద్యమానికి కొత్త మలుపు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 6:
కోరుట్లలోని చారిత్రక గడిబురుజులు–మెట్ల బావి కోనేరు ప్రాంతం మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న గడి మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ బీజేపీ ధార్మిక విభాగం ఆధ్వర్యంలో గురువారం గొర్రె పొట్టేలు, బోనాలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
డప్పు చప్పుళ్ల మధ్య సాగిన ఊరేగింపులో పట్టణంలోని పలు కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గడి మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్–స్వప్న, జిల్లా కార్యదర్శి సుదవేణి మహేష్ మాట్లాడుతూ, గడి మైసమ్మ ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు.
వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గడిబురుజులు–మెట్ల బావి కోనేరు ప్రాంతంలో కొలువై ఉన్న గడి మైసమ్మ తల్లి దేవాలయం చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైందని, అదే సమయంలో ఆ స్థలాలపై అక్రమ కబ్జాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పలువురు పేర్కొన్నారు.
ఈసందర్భంగా పూజల్లో పాల్గొన్న అఖిలపక్ష ప్రజాసంఘాల నేత డా. పేట భాస్కర్ మాట్లాడుతూ, గడి మైసమ్మ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన బీజేపీ నాయకుల నిర్ణయం స్వాగతించదగ్గదని, చారిత్రక గడి స్థలాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
గడి స్థలాల పరిరక్షణతో పాటు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కోరుట్లలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ధార్మిక విభాగం ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ పూజలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరుట్ల ఎస్సై 2 గంగాధర్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.





0 Comments