సైబర్ నేరాల పట్ల అవగాహన, సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్
*“సురక్షా కా తిరంగా – Stay Alert, Stay Aware, Stay Cyber Safe” సందేశంతో విస్తృత సైబర్ అవగాహన కార్యక్రమం
*"సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ*
డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, ఆగస్టు 5:
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే "సైబర్ జాగ్రూక్తా దివస్" కార్యక్రమంలో భాగంగా, “Suraksha Ka Tiranga – Stay Alert, Stay Aware, Stay Cyber Safe” అనే ప్రత్యేక సందేశంతో జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం కోరుట్ల పట్టణంలోని పీబీ ఫంక్షన్ హాల్‌లో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐపీఎస్ పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ, డిజిటల్ భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు.విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ లింకులు, మోసపూరిత ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మోసాలు, నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి మోసాలు, క్యూ ఆర్ కోడ్ స్కామ్‌లు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు తదితర అంశాలపై సవివరంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అలాగేవ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
ఆన్‌లైన్‌లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, అలాగే www.cybercrime.gov.in పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై వారికి అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలకు కూడా తెలియజేసి సైబర్ నేరాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, సైబర్ మోసాలకు నేరస్తులు అనుసరిస్తున్న కొత్త పద్ధతులు ఏమిటి, వాటి పట్ల ప్రజలు ఎలాంటి అప్రమత్తతతో వ్యవహరించాలనే అంశాలను విద్యార్థులు నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటిక ద్వారా సైబర్ నేరాలపై అవగాహనతో పాటు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా వివరించారు. సైబర్ భద్రతపై చైతన్యం కలిగించేలా నాటికను ప్రదర్శించిన విద్యార్థులను జిల్లా ఎస్పీ అభినందించి, వారి ప్రతిభను ప్రశంసిస్తూ బహుమతులను ప్రదానం చేశారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఆగస్టు–2026 స్వాతంత్య్ర మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" సైబర్ అవగాహన ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐపీఎస్, డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు గంగారం, రవికిరణ్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐలు కృష్ణ, దినేష్, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




0 Comments